తగ్గని వర్షపు నీరు

ABN , First Publish Date - 2021-11-21T08:53:37+05:30 IST

జిల్లాపై వర్షప్రభావం కొనసాగుతూనే వుంది.

తగ్గని వర్షపు నీరు
చిత్తూరు తేనబండ మసీదువీధిలో ప్రవహిస్తున్న వర్షపునీరు

అందని సాయం


తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై వర్షప్రభావం కొనసాగుతూనే వుంది.చిత్తూరు నీవానదిలో ఉధృతంగా నీళ్లు ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లన్నీ ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి.రిక్షా కాలనీ, వీరభద్రకాలనీ, దోబీఘాట్‌ తదితర కాలనీల్లోని వీధుల్లో వరదనీరు ప్రవహిస్తున్నాయి. ప్రమాదకరంగా ఉన్న సంతపేట లిల్లీ బ్రిడ్జిదారిని అధికారులు మూసివేశారు.నీవానదిలో సగం వరకు నీటి ఉధృతి తగ్గితే తప్ప పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లల్లో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తిరుపతిలో పలు ప్రాంతాలు ఇంకా వర్షపు నీటిలోనే వున్నాయి.ఓదార్పు, సాయం అందక బాధిత జనం నేతలను, అధికారులను శాపనార్ధాలు పెడుతున్నారు. ఇళ్ళలో నీరు చేరి వస్తువులు, సరుకులన్నీ పాడైనందున తాగునీటికి కూడా అవస్థ పడుతున్నామని వాపోతున్నారు. పుంగనూరు  పట్టణానికి ఎగువన వున్న రాయలచెరువుకు ప్రమాదం తప్పిపోయింది. ప్రస్తుత వర్షాలకు చెరువు నిండిపోయి కట్ట తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ఈ చెరువు నీటితో పుంగమ్మచెరువుకూ ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న  సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి హుటాహుటిన అధికారులతో కలసి శుక్రవారం రాత్రి పుంగనూరు చేరుకున్నారు. దగ్గరుండి మరీ  చెరువు మొరవను కొంతమేరకు తొలగింపజేశారు. దాంతో చెరువులోని నీరంతా మొరవ ద్వారా వెలుపలికి వెళుతున్నందున ప్రమాదం తప్పినట్టయింది.చంద్రగిరి మండలం, ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యామ్‌ నీటి ఉధృతానికి మత్స్యశాఖ కేంద్రం ముంపునకు గురైంది.దీంతో అందులోని రూ.22 లక్షల విలువ గల చేప పిల్లలు కొట్టుకుపోయాయి.


సీఎం ఏరియల్‌ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ శనివారం ఏరియల్‌ సర్వే చేపట్టారు.కడప, చిత్తూ రు, నెల్లూరు సహా భారీవర్ష ప్రభావిత ప్రాం తాలను ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు పరిశీలించారు. అనంతరం ఒంటిగంటకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని గన్నవరం వెళ్లారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి,ఆదిమూలం, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు సీఎంకు జిల్లాపై వర్ష ప్రభావాన్ని వివరించారు.

Updated Date - 2021-11-21T08:53:37+05:30 IST