ఆటోలకు ప్రత్యేక నెంబర్లు

Nov 30 2021 @ 02:21AM
ఆటోకు ప్రత్యేక నంబరు స్టిక్కర్‌ అతికిస్తున్న ఎస్పీ వెంకట అప్పలనాయుడు

ప్రయాణికుల భద్రత దృష్ట్యా కేటాయింపు

3 చక్ర యాప్‌ద్వారా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం 


తిరుపతి(నేరవిభాగం), నవంబరు 29: తిరుపతి నగరంలో ఆటోలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి ప్రయాణికులకు మరింత రక్షణ కల్పించనున్నట్లు అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. 3 చక్ర యాప్‌ద్వారా ఆటోలను పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు. తిరుపతిలో సోమవారం ఆయన ఆటో యజమానులతో సమావేశమయ్యారు. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తుల్లో అత్యధికులు, స్థానికులు కూడా ఆటోలపై ఆధారపడుతుంటారన్నారు. వీరిలో మహిళలు, యువతులు, పిల్లలు ఎక్కువగా ఉంటారని, కొందరు ఒంటరిగానూ ప్రయాణిస్తుంటారన్నారు. వీరందరికీ రక్షణ కల్పించేందుకు ప్రతి ఆటోకు నంబరు కేటాయించి, యాప్‌ద్వారా పోలీసులకు అనుసంధానం చేస్తామన్నారు. అన్ని ఆటోల వివరాలతో క్యూఆర్‌ కోడ్‌ను కేటాయిస్తామన్నారు. ఈ క్రమంలో వినియోగదారులు 3చక్ర యాప్‌ద్వారా తమకు దగ్గరగా ఉన్న ఆటోను బుక్‌చేసుకోవచ్చన్నారు. క్యూఆర్‌ కోడ్‌ద్వారా ఆటో, యజమాని, డ్రైవర్‌ వివరాలను తెలుసుకుని అవసరమైతే తమవారికి పంపించవచ్చని సూచించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో పోలీసులకూ సమాచారం ఇచ్చి సహాయం పొందవచ్చన్నారు. ప్రత్యేక నంబర్లు, 3 చక్ర యాప్‌ ద్వారా నగరంలో ఏ ఆటో ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడెక్కడ ఆగింది అనే వివరాలను తెలుసుకుంటూ నిఘాపెట్టే అవకాశం కలుగుతుందన్నారు. ప్రయాణికులందరూ 3 చక్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.  


ఆటో యజమానులకూ ప్రయోజనం 

ఉబర్‌, ఓలా మాదిరిగా ప్రయాణికులు 3చక్ర యాప్‌ద్వారా ఆటోను బుక్‌ చేసుకునే అవకాశం ఉండటం ఆటో యజమానులకు లాభించే అంశమేనని ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ఆటో యజమాని 3చక్ర యాప్‌లో ఆటో, యజమాని, డ్రైవర్‌ వివరాలను నమోదు చేయాలన్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 3చక్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అన్ని వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. నగరంలోని  అన్ని పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు ఆటోల రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేక నంబర్లను ఎలా కేటాయిస్తారు? ఇతర వివరాలను ఆటో యజమానులకు ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు మల్లికార్జున, కాటమరాజు (ట్రాఫిక్‌-1, 2), నరసప్ప (వెస్ట్‌), సీఐలు శివప్రసాద్‌రెడ్డి (ఈస్ట్‌), రామసుబ్బయ్య (ట్రాఫిక్‌), 3 చక్ర యాప్‌ డెవలపర్‌ రియాజ్‌, ఆటో యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.