ధాన్యం.. దైన్యం

May 8 2021 @ 23:07PM
నరసన్నపేట : కరగాంలో కళ్లాలో ్ల మూలుగుతున్న ధాన్యం బస్తాలు

అమ్ముడుపోని రబీ పంట

కళ్లాల్లో మూలుగుతున్న బస్తాలు

కానరాని కొనుగోలు కేంద్రాలు

 రైతులను దోచుకుంటున్న దళారులు, మిల్లర్లు

 భయపెడుతున్న అకాల వర్షాలు

(నరసన్నపేట/ఎచ్చెర్ల)

రబీలో అన్నదాతలు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట అమ్ముడుపోవడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక.. కొనేవారు రాక కళ్లాల్లో ధాన్యం రాశులు మూలుగుతున్నాయి. చేసేదీ లేక దళారీలను, మిల్లర్లను అన్నదాతలు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి వారు దోచుకుంటున్నారు. జిల్లాలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, కోటబొమ్మాళి, టెక్కలి, సంతబొమ్మాళి, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, పాతపట్నం, ఎచ్చెర్ల, తదితర మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. పంట చేతికి వచ్చింది. ముమ్మరంగా వరికోతలు, నూర్పులు జరుగుతున్నాయి. ఈ పంటను అమ్ముకొనేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రబీ సీజన్‌లో మాత్రం పట్టించుకోలేదు. దీంతో మిల్లర్లు, దళారీలు అడిగిన ధరకే రైతులు పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం క్వింటాకు రూ.1888 మద్దతు ధర నిర్ణయించగా.. వ్యాపారులు మాత్రం దీనిపై రూ.300 నుంచి రూ.500 తక్కువకు కోనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో బస్తాకు రెండు నుంచి మూడు కేజీల వరకు మార్జిన్‌ తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 1500 మెట్రిక్‌ టన్నుల వరకు వరి దిగుబడి వచ్చింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా మండపేట, సామర్లకోట వ్యాపారులకు పంటను విక్రయించుకుంటున్నారు. దీనికోసం దళారీలకు బస్తాకు రూ.50 వరకు చెల్లిస్తున్నామని రైతులు చెబుతున్నారు. 


 మిల్లర్లదీ అదే తీరు..

ధాన్యం కొనుగోలులో కొందరు మిల్లర్లు దళారీల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా వస్తుందని.. రబీలో పండించే ధాన్యానికి మన జిల్లాలో డిమాండ్‌ ఉండదని రైతులకు కుంటిసాకులు చెప్పి దోచుకుంటున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కోనుగోలు చేసి రోజుకు పది నుంచి ఇరవై లారీల వరకు మండపేట, సామర్లకోటకు ఎగుమతి చేస్తున్నారు.  వాస్తవానికి సార్టెక్స్‌ మిల్లులో ఈ ధాన్యం మర పట్టి సివిల్‌ సప్లయ్స్‌కు ఇవ్వవచ్చు. కానీ, అలా చేయకుండా  రైతులను దోచుకుంటున్నారు. 


పంటను కాపాడుకొనేందుకు పాట్లు

గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కళ్లాలు, పొలాల్లోని ధాన్యం బస్తాలను కాపాడుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొందరు కళ్లాల్లోనే టార్పాలిన్లపై ధాన్యం రాశులు పోసి ఎండబెడుతున్నారు. మరికొందరు రహదారులపై ఆరబెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.