కిడ్నాప్‌ యత్నాన్ని అడ్డుకున్న గ్రామస్థులు!

ABN , First Publish Date - 2021-01-24T06:23:21+05:30 IST

చిన్నారులను కిడ్నాప్‌ చేసేందుకు వచ్చినట్టుగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు చితకబాది బంధించారు.

కిడ్నాప్‌ యత్నాన్ని అడ్డుకున్న గ్రామస్థులు!

అనుమానితుడికి  దేహశుద్ధి

మెదక్‌ రూరల్‌, జనవరి 23: చిన్నారులను కిడ్నాప్‌ చేసేందుకు వచ్చినట్టుగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు చితకబాది బంధించారు. ఈ ఘటన మెదక్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని అవుసులపల్లిలో శనివారం జరిగింది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం రామాయపల్లికి చెందిన స్వామి అనే వ్యక్తి శనివారం ఉదయం అవుసులపల్లిలో సంచరించాడు. గ్రామంలోని పలు ఇళ్లలో భిక్షాటన చేస్తూ, రాపోలు బాలరాజు కుమార్తె దివ్యను ఎత్తుకోగా ఆమె  ఏడ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు స్వామిని పట్టుకుని చితకబాదారు. పెద్దఎత్తున జనం గుమిగూడి గాయాలైన అనుమానితుడిని మున్సిపల్‌ కార్యాలయంలో బంధించారు. మెదక్‌ రూరల్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డి  వచ్చి నిందితుడిని అదుపులోకి  తీసుకున్నారు. ఒళ్లంతా గాయాలు కావడంతో  చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అనుమానితుడు స్వామి మాత్రం మరో విధంగా చెబుతున్నాడు. తాను కరోనాకు ముందు కరాటే మాస్టర్‌గా పనిచేశానని, ఉపాధి లేక భిక్షాటన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తన వేషధారణను చూసి పాప భయపడటంతో ఏడ్పు మాన్పించేందుకు ఎత్తుకున్నానే తప్ప కిడ్నాప్‌ చేసేందుకు కాదని చెప్పుకొచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2021-01-24T06:23:21+05:30 IST