శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయ్‌!

Published: Mon, 23 May 2022 01:09:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయ్‌!కొత్తపేట మండలం ఖండ్రిగలో జరిగిన దాడిలో ధ్వంసమైన వస్తువులు

  • కోనసీమ జిల్లా పేరు మార్పుతో కులాల మధ్య వార్‌
  • పలుచోట్ల దాడులు.. ఆస్తులు ధ్వంసం
  • అమలాపురం సహా పలు మండలాల్లో సెక్షన 144 అమలు
  • సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు
  • శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీ అభ్యర్థన
  • నేటి గ్రీవెన్స, డీడీఆర్సీ సమావేశానికి భారీ భద్రత

జిల్లా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంతో సామాజికవర్గాల మధ్య ‘వార్‌‘ మొదలైంది. ఇళ్లు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. పోలీసులు ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగే గ్రీవెన్సకు భారీగా ప్రజలు హాజరై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేస్తారన్న ప్రచారంతో జిల్లా కేంద్రమైన అమలాపురంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసులతో పట్టణంలోని ముఖ్య కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలతో పాటు కొత్తపేట, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన విధిస్తున్నట్టు ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సెక్షన 30 అమలులో ఉంది. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా నామకరణం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రోజురోజుకూ సామాజికవర్గాల మధ్య సమస్యగా మారుతోంది. దీనికితోడు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో కులాల మధ్య వార్‌ మైదలైంది. కొత్తపేట గ్రామానికి చెందిన కోటిపల్లి దామోదర్‌ అనే యువకుడు జిల్లా పేరు మార్చద్దంటూ చేసిన వ్యాఖ్యానానికి ఆగ్రహం చెందిన ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందినవారు అతనిపై దాడి చేసేందుకు జెర్సీ పాల కేంద్రం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ దామోదర్‌ లేకపోవడంతో అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోయారు. దీనిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో బీసీ సామాజికవర్గానికి చెందిన దంగేటి రాజేష్‌ జిల్లాకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. దాన్ని చూసి ఆగ్రహం చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకులు సుమారు నలభై మంది కండ్రిగలోని రాజేష్‌ ఇంటిపై దాడికి దిగి ఆస్తులు ధ్వంసం చేశారు. మోటారు సైకిళ్లు, ఇంట్లో వంట సామగ్రితో పాటు ఇతర సామాన్లను ధ్వంసం చేశారు. రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారుతుండడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా అంతకు ముందు ఉప్పలగుప్తం మండలం ఎన.కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు పెట్టిన పోస్టుకు ఆగ్రహం చెందిన ప్రత్యర్థి సామాజికవర్గం వారు అతడిని అదుపులోకి తీసుకుని విగ్రహానికి క్షీరాభిషేకం చేయించి కాళ్లు పట్టిచ్చారు. అమలాపురం రూరల్‌ మండలం గున్నేపల్లి అగ్రహారంలో కొందరు వైసీపీ స్థూపాన్ని ధ్వంసం చేశారు. ఇలా ప్రశాంతంగా ఉండే కోనసీమ గ్రామీణ ప్రాంతాల్లో మొదలవుతున్న సామాజికవర్గ సమస్యలను ఆదిలోనే అదుపు చేయకపోతే గత అనుభవాల దృష్ట్యా పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు సోమవారం జరిగే కలెక్టర్‌ గ్రీవెన్సకు జిల్లా పేరును వ్యతిరేకిస్తూ అభ్యంతరాలను తెలియ చేసేందుకు వేలాది మంది తరలివస్తారన్న నిఘా వర్గాల హెచ్చరికతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రీవెన్స జరిగే  కలెక్టరేట్‌  వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేయిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు అమలాపురంలోని క్షత్రియ కల్యాణ మండపంలో జరిగే తొలి డీడీఆర్సీ సమావేశానికి జిల్లా ఇనచార్జి మంత్రి జోగి రమేష్‌తో పాటు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరు కానున్నారు. దాంతో పోలీసులు అమలాపురం పట్టణాన్ని గత అనుభవాల దృష్ట్యా పట్టణంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఎక్కడికక్కడే పికెటింగ్‌ పెట్టి ప్రజలను తనిఖీ చేస్తున్నారు. కాగా పి.గన్నవరం ఎస్‌ఐ సురేంద్ర పప్పులవారిపాలెం యువకులపై విచక్షణారహితంగా చేసిన దాడిని నిరసిస్తూ కాపు సామాజికవర్గానికి చెందినవారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వారు పోలీసులకు ఇచ్చిన గడువు ముగియనుండడంతో ఆందోళనలు ఏ రీతిలో ఉంటాయోనన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బాధితులపై ఎస్‌ఐ జరిపిన లాఠీచార్జీ ఘటనపై విచారణకు డీఎస్పీ వై.మాధవరెడ్డి నియమితులు కావడం, ఎస్‌ఐ సురేంద్రను ప్రస్తుతం వీఆర్‌లో ఉంచారు. పి.గన్నవరం ఇనచార్జి ఎస్‌ఐ గంగాభవానిని తాత్కాలికంగా నియమించడం ద్వారా కాపు సామాజికవర్గాల నేతలు ఇచ్చిన అల్టిమేటంలో డిమాండ్లను అమలు చేసినట్టయింది. కోనసీమవ్యాప్తంగా పరిస్థితులు అదుపు తప్పకుండా అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.