భయం భయం

ABN , First Publish Date - 2021-03-02T05:57:09+05:30 IST

ఏనుగులను తరిమి వేసి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతూ పుత్తూరు మండలం నందిమంగళం గ్రామస్తులు ఆందోళనకు దిగారు

భయం భయం
రాస్తారోకో చేస్తున్న నందిమంగళం గ్రామస్తులు

పుత్తూరు, మార్చి 1: ఏనుగులను తరిమి వేసి... పంటలు, ప్రాణాలను కాపాడాలని నందిమంగళం గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని చెన్నై-తిరుపతి జాతీయ రహదారిలో బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏనుగులు చెరకు, వరి పంటలను నాశనం చేస్తున్నాయని వాపోయారు. జనావాసాల వైపు కూడా రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయభయంగా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదులు చేస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏనుగులను అటవీప్రాంతం వైపు తరిమి వేయడంపై అధికారులు హామీఇవ్వాలని తేల్చిచెప్పారు. పుత్తూరు, నగరి సీఐలు వెంకట్రామిరెడ్డి, మద్దయ్యఆచారి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పంట నష్టపరిహారం మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. గజరాజుల దాడుల సమస్యను రెండురోజుల్లో పరిష్కరిస్తామని పేర్కొనడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన, సీపీఎం నేత వెంకటేష్‌, రైతులు చిట్టిబాబు, మునిరత్నం, మునిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:57:09+05:30 IST