నర్సాపూర్‌లో అభివృద్ధి జాడేది?

ABN , First Publish Date - 2021-06-24T05:11:01+05:30 IST

నర్సాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధి జాడే కనిపించడం లేదు. నిధులు మంజూరైన పనులు మాత్రం ప్రారంభానికి నోచకోవడం లేదు. ఓవైపు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన పనులకు మోక్షం లభించడం లేదు. మరోవైపు సీఎం ప్రత్యేకంగా మంజూరు చేసిన నిఽధులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

నర్సాపూర్‌లో అభివృద్ధి జాడేది?
మంత్రి పర్యటన నేపథ్యంలో మున్సిపల్‌ నూతన భవనం కోసం హడావిడిగా చేపట్టిన సర్వే

నిధులున్నా పనుల ఊసేలేదు

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ప్రత్యేక నిధులకు మోక్షమెప్పుడో ?

అన్ని ప్రతిపాదనలకే పరిమితం

ఒక్క రూపాయైునా ఖర్చు చేయని వైనం

నేడు పట్టణంలో మంత్రి హరీశ్‌ పర్యటన


నర్సాపూర్‌, జూన్‌ 23 : నర్సాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధి జాడే కనిపించడం లేదు. నిధులు మంజూరైన పనులు మాత్రం ప్రారంభానికి నోచకోవడం లేదు. ఓవైపు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన పనులకు మోక్షం లభించడం లేదు. మరోవైపు సీఎం ప్రత్యేకంగా మంజూరు చేసిన నిఽధులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.


సీఎం ప్రకటించిన నిధుల గతేంటి?

గతేడాది జూన్‌ 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నర్సాపూర్‌ అర్బన్‌ పార్కు ప్రారంభానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక నిఽధలను మంజూరు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.కోటి, నర్సాపూర్‌ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు విడుదల చేస్తానని ప్రకటించారు. పంచాయతీకి రూ.20 లక్షలు ప్రకటించడంతో దీంతో గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేయొచ్చని సర్పంచులు సంబురపడ్డారు. ఈ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితం కావడం, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో పలువురు సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన వారే కావడంతో అటు బయటకు చెప్పుకోలేక ఇటు పనులు చేయలేక లోలోపన ఆవేదనకు గురవుతున్నారు. 


మున్సిపాలిటీలోనూ అంతే!

నర్సాపూర్‌ పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.25 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పట్టణంలో రూ.2 కోట్లతో మున్సిపల్‌ భవనం, రూ.4 కోట్లతో సమీకృత మార్కెట్‌, రూ.2 కోట్లతో మినీస్టేడియం, డంపింగ్‌యార్డు నిర్మాణం, శ్మశానవాటిక ఆధునీకరణ తదితర పనులు చేపేట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. మిగతా నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, కమ్యూనిటీ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పలుమార్లు ఈ పనులపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలను సైతం నిర్వహించారు. మున్సిపల్‌ భవనం కోసం పాత భవనాన్ని, స్టేడియం కోసం కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంను కూల్చి వేసి పనులను త్వరగా ప్రారంభిస్తామని గతేడాదే ప్రకటించారు. అదేవిధంగా మాంసం విక్రయ దుకాణ సముదాయాన్ని కొత్తగా నిర్మిస్తామని చెప్పి కూల్చివేయడంతో ప్రస్తుతం రోడ్డుపై పెట్టుకునే పరిస్థితి నెలకొన్నది. సీఎం ప్రకటించిన ప్రత్యేక నిధులతో జరగాల్సిన పనుల్లోనే ఇంత జాప్యం జరిగితే ఇక మిగతా పనులేమి చేస్తారని పట్టణావాసులు అభిప్రాయపడుతున్నారు. ఇక మున్సిపాలిటీ ఏర్పడిన అనంతరం నర్సాపూర్‌ పట్టణాభివృద్ధి కోసం రూ.15 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధుల్లో రూ.4 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కోసం మున్సిపల్‌ ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేవు. శిలాఫలకానికే పరిమితమయ్యాయి. 


ఎమ్మెల్యే, చైర్మన్‌ మధ్య వివాదాలు

ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ మురళిధర్‌యాదవ్‌ లేకుండానే మున్సిపల్‌ నూతన భవనానికి, డంపింగ్‌యార్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీంతో అప్పట్లో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం ఊపందుకున్నది. కాగా ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగినట్లు, దీంతో పాటు చైర్మన్‌కు పలువురు సొంత పార్టీ కౌన్సిలర్లతో ఉన్న విభేదాలు దూరమైనట్లు అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఇప్పటికైన పనులకు మోక్షం లభిస్తుందో చూడాలి.


ఎంపీ హామీ ఇచ్చిన వైకుంఠరథం

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గతంలో నర్సాపూర్‌ వచ్చిన సందర్భంగా తన నిధులతో వైకుంఠరథం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు అది అమలుకు నోచుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైకుంఠరథాలున్నాయి. నర్సాపూర్‌లో ఈనాటికి లేకపోవడంపై అధికార పార్టీ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


పేరుకే డివిజన్‌ కేంద్రం

నర్సాపూర్‌ నియోజకవర్గం పేరుకే డివిజన్‌ కేంద్రం తప్ప ఆ స్థాయిలో ఒక్కటీ లేదు. డివిజన్‌ చేశాక ఆర్డీవో కార్యాలయం ఒక్కటే ఏర్పాటయింది.  ప్రస్తుతం ఆర్డీవో లేకపోవడంతో ఇన్‌చార్జిగా మెదక్‌ ఆర్డీవో విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్‌ కేంద్రంగా ప్రకటించిన సమయంలో ఆర్డీవో కార్యాలయంతోపాటు పోలీసు డీఎస్పీ కార్యాలయం, ఎంవీఐ కార్యాలయం, విద్యుత్‌శాఖ డీఈఈ కార్యాలయాలతో పాటు ఇతర డివిజన్‌ స్థాయి ఆఫీసులు కూడా ఏర్పాటవుతాయని గొప్పలు చెప్పారు. పైగా డీఎస్పీ కార్యాలయం వచ్చేసింది త్వరలోనే ఏర్పాటవుతుందన్నారు. అందుకు తాత్కాలిక కార్యాలయం కోసం భవనం కూడా చూశారు. కానీ ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు.  ఇక నర్సాపూర్‌ పట్టణంలోని నిరుపేదల కోసం నిర్మిస్తున్న 500 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఏళ్ల తరబడిగా సాగుతూనే ఉన్నాయి. ఆ ఇళ్ల కోసం సుమారు 3వేల మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకుని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక నీటిపారుదలశాఖకు చెందిన ఈఈ కార్యాలయం ఈ మధ్యనే నర్సాపూర్‌లో ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకే ఇదే నియోజకవర్గంలోని సంగారెడ్డి జిల్లాలో కలిపిన హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేయడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం మండల కేంద్రం కూడా కానీ దౌల్తాబాద్‌లో ఏకంగా ఈఈ స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  కేవలం నీటిపారుదల ఉన్నతాధికారులు తమ అనుకూలం కోసం ఈవిధంగా చేశారనే విమర్శలూ లేకపోలేదు. ఈనెల 25న రాష్ట్రఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నర్సాపూర్‌కు వస్తున్నందున వీటిన్నంటిపై కూడా దృష్టి సారించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మరీ హరీశ్‌రావు రాకతోనైనా డివిజన్‌ కేంద్రంలోని సమస్యలు తీరుతాయా చూడాలి. 


Updated Date - 2021-06-24T05:11:01+05:30 IST