వానాకాలంలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే!
ABN , First Publish Date - 2022-07-21T17:19:07+05:30 IST
అధిక తేమతో కూడిన చల్లని వానాకాలం వాతావరణంలో సూక్ష్మజీవులు పసికందుల చర్మం మీద విస్తృతంగా
ప్రశ్న: వానాకాలంలో పసికందులకు చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- ఓ సోదరి, ధర్మవరం.
అధిక తేమతో కూడిన చల్లని వానాకాలం వాతావరణంలో సూక్ష్మజీవులు పసికందుల చర్మం మీద విస్తృతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. పసికందుల శరీరాల్లో థర్మోరెగ్యులేటరీ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులను పసి చర్మాలు తట్టుకోలేవు. కాబట్టి ఈ కాలంలో ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.
- పసిపిల్లలకు తేలికైన కాటన్ దుస్తులు వేయాలి. పొడవాటి చేతుల దుస్తులు వేస్తే, దోమ కాటు నుంచి కూడా రక్షణ దొరుకుతుంది.
- ప్రతి రెండు గంటలకోసారి డయాపర్ మారుస్తూ ఉండాలి. లేదంటే తడిచిన వెంటనే మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కటి ప్రాంతంలో తేమను నియంత్రించగలుగుతాం. అలాగే రోజులో 2 నుంచి 4 గంటల పాటు డయాపర్ లేకుండా పిల్లలను వదిలేయాలి.
- పసి పిల్లలకు స్వచ్ఛమైన కొబ్బరినూనె పట్టించాలి. పసికందుల చర్మం లోపలి పొరల్లోకి ఈ నూనె తేలికగా ఇంకిపోతుంది.
- వానాకాలం వాతావరణం మూలంగా పిల్లల రోగనిరోధకశక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్లు తేలికగా సోకుతూ ఉంటాయి. కాబట్టి మురికితో కూడిన పరిసరాలకు, సుస్తీ చేసిన వారికి పసికందులను దూరంగా ఉంచాలి.
- దోమల మందులకు బదులుగా దోమ తెరలు వాడుకోవాలి.
ఇలా చేయండి...
- ప్రతి రోజూ స్నానం చేయిస్తూ, చర్మాన్ని శుభ్రంగా ఉంచాలి. స్నానం కోసం సున్నితమైన క్లీన్సర్, గోరువెచ్చని నీళ్లు వాడాలి.
- స్నానం చేయించిన వెంటనే, చర్మాన్ని రుద్దకుండా, పొడిగా తుడవాలి.
- స్నానం తర్వాత కొబ్బరి నూనె పూయడం వల్ల, పిల్లల చర్మం తేమను సంతరించుకుని, దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
- రాత్రి నిద్రకు ముందు పల్చని బాడీ లోషన్ అప్లై చేయాలి.
- వానాకాలంలో కూడా తీవ్రమైన ఎండ సోకకుండా చూసుకోవాలి. ఆరు నెలలు దాటిన పసికందులకు పిల్లల కోసం ఉద్దేశించిన సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలి.
- న్యాపీ మార్చే ప్రతిసారీ ఆ ప్రదేశాన్ని కాటన్ క్లాత్‌తో పొడిగా తుడిచి, వర్జిన్ కొకొనట్ ఆయిల్ పూయాలి. మలమూత్రాల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఉండేలా కొబ్బరి నూనె బిడ్డకు రక్షణ కల్పిస్తుంది.
-డాక్టర్ జుష్యా భాటియా సరీన్,
డెర్మటాలజిస్ట్