కర్ఫ్యూ కొనసాగనుందా?

ABN , First Publish Date - 2021-05-31T05:19:56+05:30 IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న కర్ఫ్యూ యథావిధిగా కొనసాగనుందా? లేక ప్రభుత్వం సడలింపు ఇవ్వనుందా? అనే అంశం చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు, ఇతర పనుల కోసం ప్రజలు బయట తిరిగేందుకు అనుమతి ఉంది. మధ్యాహ్నం 12 నుంచి తెల్లవారి 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతోంది. దీనికితోడు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు గతంతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి.

కర్ఫ్యూ కొనసాగనుందా?
నిర్మానుష్యంగా ఉన్న శ్రీకాకుళం నగరం

- నేటితో ఆంక్షలు గడువు పూర్తి

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న కర్ఫ్యూ యథావిధిగా కొనసాగనుందా? లేక ప్రభుత్వం సడలింపు ఇవ్వనుందా? అనే అంశం చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు, ఇతర పనుల కోసం ప్రజలు బయట తిరిగేందుకు అనుమతి ఉంది. మధ్యాహ్నం 12 నుంచి తెల్లవారి 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతోంది.  దీనికితోడు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు గతంతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి. కర్ఫ్యూ ప్రారంభమైన రోజు(ఈ నెల 5న) 1,982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తర్వాత వారం రోజుల వరకూ అదేరీతిలో కేసులు పెరిగాయి. ప్రస్తుతం నాలుగు రోజులుగా వెయ్యిలోపు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కర్ఫ్యూ కొనసాగిస్తారా? ఆంక్షలు సడలిస్తారా? అని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రవాణా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు సైతం తిరగడం లేదు. ట్రాన్స్‌పోర్ట్‌ సేవలు అంతగా అందుబాటులో లేకపోవడంతో నిత్యావసరాల ధరలు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ధరల భారం పడుతోంది. మరోవైపు ఆంక్షలు సడలించకపోతే ఇటు అద్దెలు చెల్లించలేక.. అటు దుకాణాలు తెరవలేక ఇబ్బందులు పడుతున్నామని హోటల్‌ యజమానులు, దుకాణదారులు పేర్కొంటున్నారు. కర్ఫ్యూ కారణంగా ఉపాధి కరువవుతోందని, కూలికి వెళ్తేనే తమకు ఇళ్లు గడుస్తుందని కార్మికులు వాపోతున్నారు. ఇలా కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై అన్నివర్గాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉన్నా కొంతమంది ఇష్టానుసారంగా ద్విచక్ర వాహనాలతో రోడ్లపై తిరిగేస్తున్నారు. మాంసాహారం, మద్యం దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ గుమిగూడిపోతున్నారు. దీంతో కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదని, మరో రెండు నెలలు పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగింపు విషయమై ప్రభుత్వం నేడు స్పష్టత ఇవ్వనుంది.  


 మరో 8 మంది మృతి

కొత్తగా 623 మందికి కరోనా పాజిటివ్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 30 : జిల్లాలో కరోనా బాధిత మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో ఆదివారం 623 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, కొవిడ్‌ లక్షణాలతో మరో 8 మంది మృతి చెందారు. జిల్లాలో కరోనా బాధిత మృతుల సంఖ్య 568కు చేరుకుంది.  ఆదివారం  4,321 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 12,57,002 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. జిల్లావ్యాప్తంగా 1,09,048 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో చాలామంది బాధితులు కోలుకున్నారు. ఆదివారం 1,517 మంది ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి  డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం 9,584 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 7,406 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 849 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1,329  మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-05-31T05:19:56+05:30 IST