వైసీపీ బరితెగింపు

ABN , First Publish Date - 2021-04-18T07:08:53+05:30 IST

లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా..

వైసీపీ బరితెగింపు
పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిలిచిన... వెలుపలకు వస్తున్న వాహనాలు

రంగంలోకి దొంగ ఓటర్లను దింపిన నేతలు

ఎటుచూసినా వందలకొద్దీ వాహనాలు, గుంపులుగా స్థానికేతరులు


పోలీసు వారి హెచ్చరిక 

పోలింగ్‌ సందర్భంగా తిరుపతి నగరంలో స్థానికేతరులు ఉండకూడదు. పార్టీలకు, ఇతర ప్రాంతాల వారికి కల్యాణ మండపాలు, గదులు ఇవ్వకూడదు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున గుంపులుగా తిరగకూడదు. 


జరిగిందేమిటి? 

ప్రైవేటు బస్సులు, వాహనాల్లో జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా నగరానికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్‌ హాలులో చాలా మంది దిగారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ కనిపించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు.


ముందు నుంచీ నిబంధనలు, హెచ్చరికలతో హోరెత్తించిన పోలీసులు.. చివరకు ప్రేక్షకుల్లా మారిపోయారు. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా తిరుపతిలో వైసీపీ నేతలు బరితెగించారు. వందలాది వాహనాల్లో వేలాది మంది స్థానికేతరులను తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రినుంచే పలువురు దొంగ ఓటర్లను తిరుపతి రూరల్‌ ప్రాంతాలకు తరలించి కల్యాణ మండపాల్లో వసతి కల్పించినట్టు తెలుస్తోంది. ఇక, శనివారం దొంగ ఓటర్లను కొందరు వైసీపీ నాయకులు ఇళ్లకు తీసుకెళ్లి అల్పాహారం, పిల్లలకు తినుబండారాలను అందించారు. మరికొందరికి వాహనాల్లో, రోడ్లపైనా భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇంకొందరు ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులను కట్టలుకట్టలుగా పట్టుకుని ఉండటం, వాహనాల్లో వచ్చినవారికి  అందించడం కనిపించింది. వీరి చర్యతో నిజమైన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద అధికార పార్టీ ప్రతినిధుల హవా నడిచింది. 


పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ ముందు ధర్నా

దొంగ ఓట్లు వేసేందుకు స్థానికేతరులు అధిక సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ తిరుపతిలోని పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడివారిని ప్రశ్నించగా.. పాస్‌పోర్టు కోసమని కొందరు, ఆస్పత్రికి వచ్చామని మరికొందరు.. సరదాగా వచ్చామంటూ ఇంకొందరు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వేలాది మందిని తిరుపతికి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని, సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకోలేదంటూ టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో నరసింహయాదవ్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


- ఎంఆర్‌పల్లె పరిధిలోని 21వ పోలింగ్‌ బూత్‌లో స్థానికేతలు దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారంతో టీడీపీ నేత శ్రీధర్‌ వర్మ కొందరిని ప్రశ్నించారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రెండుమూడు గంటల తర్వాత వదిలిపెట్టారు. అలిపిరి వద్ద మబ్బు నారాయణరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 


ఎస్పీ కార్యాలయం ముందే.. 

దొంగ ఓటర్లు వస్తున్నారన్న సమాచారంతో సుగుణమ్మ, నరసింయాదవ్‌ ఎస్పీ కార్యాలయం ముందు కాపు కాశారు. 40 మందితో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవర్‌ వద్దనున్న ఓటరు జాబితాను స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తిరుపతిలో ఉన్న ఏడు మార్గాల ద్వారా బస్సులు, జీపుల్లో దాదాపు లక్షమందిని వైసీపీ నాయకులు తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని సుగుణమ్మ ఆరోపించారు. 


- క్రైం పోలీసు స్టేషన్‌ వద్ద 25 మందితో వచ్చిన బస్సును తిరుపతి నగర టీడీపీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌ యాదవ్‌ అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


చాకచక్యంగా దొంగ ఓటర్లను పట్టుకుని.. 

33వ డివిజన్‌లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌ ముగ్గురు అనుమానితులను గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతానికి చెందిన వారంటూ ప్రశ్నించారు. తడబడుతూ సమాధానమిచ్చిన వారిని పోలీసుకులకు అప్పగించారు. ఇలా అధికార పార్టీ అక్రమంగా ఓట్లు వేయించడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.  


- 33వ డివిజన్‌లోనే సీపీఎం నాయకురాలు సుజాత మరో ముగ్గురు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. 

- ఒకటో డివిజన్‌లో మబ్బు దేవనారాయణరెడ్డి మరికొంతమంది దొంగ ఓటర్లును పట్టుకున్నారు. 

- డీబీఆర్‌ వద్ద కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌ ముగ్గురు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. 

- అలిపిరి వద్దనున్న కొన్ని పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన పనబాక లక్ష్మి కూడా కొంతమంది నకిలీ ఓటర్లను గుర్తించారు. 


ప్రతిపక్షాలు గుర్తించింది వందల్లోనే

టీడీపీ, బీజేపీ నాయకులు గుర్తించిన దొంగ ఓటర్లు వందల్లో ఉన్నారు. గుర్తించని వారు వేలల్లో ఉంటారని భావిస్తున్నారు. తానే సుమారు 70మంది నకిలీలను గుర్తించి పోలింగ్‌ కేంద్రంలోని పోలీసులకు అప్పగిస్తే ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదని బీజేపీ నేత శాంతారెడ్డి పేర్కొన్నారు. ‘అధికార’ ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. 


సుగుణమ్మపై బూతు పురాణం

ఆర్‌ఆండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్దనున్న పోలింగ్‌ బూత్‌లో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అక్కడికి చేరుకున్నారు. కొందరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ‘అసలు నీకు ఇక్కడ పని ఏంటీ. ఎవరే నువ్వు’ అంటూ కొందరు వైసీపీ నేతలు ఆమెను బూతులతో దూషించారు. దీనిని వీడియో తీసిన ఏబీఎన్‌ ప్రతినిధినీ తిట్టారు. బలవంతంగా సెల్‌ఫోన్‌ లాక్కుని వీడియోను డిలీట్‌ చేశారు.


ఓటరు వేదన 

మా ఓట్లను ఎవరో అన్యాయంగా వేశారని, అధికారులు ఏం చెబుతారంటూ ఒకటో డివిజన్‌ బాలప్రసాద్‌ వాపోయారు. ఓటేసేందుకు హైదరాబాద్‌ నుంచి తిరుపతిలోని అలిపిరికి వచ్చిన ఓ కుటుంబానికీ ఇదే అనుభవం ఎదురైంది. 


తిరుపతి ఓటర్లకు భయమంట!

ఎస్వీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేయించడానికి పాకాల, చంద్రగిరికి చెందిన కొందరిని వైసీపీ నేతలు తీసుకొచ్చారు. ‘ఒకరి ఓటు ఇంకొకరు వేయడం తప్పు కదా.. పైగా చదువుకున్నావు’ అని ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది. దీంతో ‘మీ తిరుపతి వాళ్లకు కరోనా వస్తుందని భయంతో ఇళ్లలోనే ఉన్నారు. మాకు ఆ భయం లేదు కాబట్టి వాళ్ల బదులు మేము ఓటేస్తున్నాం...తప్పేంటి..’ అంటూ సమాధానమివ్వడం గమనార్హం. 


ఇంకా ఏం జరిగిందంటే..!

- ఎంఆర్‌ పల్లె సమీపంలోని దుర్గానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓటర్లను అడ్డుకున్న టీడీపీ నేత శంకర్‌నారాయణపై సీఐ మల్లు దివాకర్‌రెడ్డి చేయిచేసుకున్నారు. 

- టీటీడీ ఏడీ బిల్డింగ్‌ వద్దనున్న పోలింగ్‌ కేంద్రానికి శ్రీవివేకానంద జూనియర్‌ కాలేజీ బస్సులో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. వారిని వైసీపీ అనుచరుల ఇళ్లలో ఉంచి దొంగ ఓట్లు వేయించారు. 

- చిత్తూరు, ఐరాల, తంబళ్లపల్లె నుంచి వేలాది మందిని పళణి టాకీస్‌ వద్దకు తీసుకువచ్చారు. 

- తిరుపతిలో రీపోలింగ్‌ను డిమాండ్‌ చేస్తూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ వెస్ట్‌పోలీస్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. 

- టీపీపీఎం పాఠశాలలో దొంగ ఓట్లు వేసేందుకు ఉదయం 8.30 గంటలకే పాకాల, చంద్రగిరి, గుర్రంకొండ ప్రాంతాలకు చెందిన వారు క్యూలో చేరారు. 

- ఎస్వీ హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన పీలేరు, కలకడ ప్రాంతాలవారికి ఉదయం 9.30 గంటలకు వైసీపీ నేతలు టిఫిన్‌ ప్యాకెట్లను అందించారు. 

- మంచినీళ్ల గుంట వద్ద  పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ఉదయం 9.45 గంటల సమయంలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి పలకరించారు. 

- పరసాల వీధి మున్సిపల్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లేసేందుకు వచ్చి స్థానికేతర యువకులకు అమ్మవారి ఆలయం ముందు ఉదయం 10 గంటలకు వైసీపీ నేతలు సూచనలిచ్చారు. 

- ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్నబజారు వీధిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో హిందూ మహిళ ఓటును వేసేందుకు బురఖా వేసుకుని వచ్చిన ముస్లిం మహిళను టీడీపీ, లోక్‌సత్తా నేతలు జయకుమార్‌, బెల్లంకొండ సురేష్‌ పట్టుకున్నారు. దొంగ ఐడీ కార్డు, ఓటరు స్లిప్పును స్వాధీనం చేసుకున్నారు. 

- ఉదయం 11.30 గంటల సమయంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో దొంగ ఓటు వేసిందన్న అనుమానంతో ఓ మహిళను వెస్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘మా అమ్మకు చదువు రాదు. ఈ విషయం వలంటీరుకు తెలిసినా, వేరే పేరున్న మహిళా ఓటరు స్లిప్పు ఇచ్చి ఓటు వేయమని పంపింది’ అంటూ బాధితురాలి కుమార్తె పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ నాయకులను నిలదీసింది. ఆ వలంటీరు దురుద్దేశంతో చేసిన తప్పును నిరసిస్తూ వారు వెళ్లిపోయారు. 

- మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆర్‌ఎస్‌ మాడవీధిలోని మున్సిపల్‌ స్కూల్లో దొంగ ఓట్లు వేసేందుకు పలమనేరు ప్రాంతంలోని నెల్లిపట్టు నుంచి కర్ణాటక రిజిస్ట్రేషన్‌ వాహనంలో మహిళలు వచ్చారు. 


ఎస్వీయూ క్యాంపస్‌లో స్కెచ్‌ 

వైసీపీ నాయకుల దొంగ ఓట్ల తంతుకు ఎస్వీయూ క్యాంపస్‌ అడ్డాగా మారింది. పీలేరు ఎమ్మెల్యే చింతల బావమరిది హరీష్‌రెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్‌ హరిప్రసాద్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎస్వీయూ క్యాంపస్‌కు చేరుకున్నారు. 13వ డివిజన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాతో దొంగ ఓట్ల తంతు సాగించారు. పీలేరు నుంచి తీసుకొచ్చిన వారికి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు అందజేసి దొంగ ఓట్లే వేయించారు. దీనికి ఎస్వీయూ క్యాంపస్‌ను వేదిక చేసుకోవడం విద్యార్థుల నుంచి విమర్శలకు దారితీస్తోంది. 

Updated Date - 2021-04-18T07:08:53+05:30 IST