గడపగడపకూ.. నిలదీతలు!

Published: Sat, 21 May 2022 23:56:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గడపగడపకూ.. నిలదీతలు! మంత్రి సీదిరి అప్పలరాజును పింఛన్‌ విషయమై నిలదీస్తున్న వృద్ధురాలు(ఫైల్‌)

గడపగడపకూ.. నిలదీతలు!
‘మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ నాయకులకు చుక్కెదురు
సమస్యలపై ప్రజల నుంచి ప్రశ్నల వర్షం
అధిష్ఠానం మాట కాదనలేక నేతల పర్యటనలు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

వైసీపీ నేతలకు గడపగడపకూ నిలదీతలు ఎదురవుతున్నాయి. సమస్యలపై ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ‘నవరత్నాలు’ ద్వారా అమలుచేసిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. గ్రామాల్లో పర్యటించాలని నేతలను ఆదేశించింది. ఈ మేరకు గ్రామాలకు వెళ్తున్న అధికారపార్టీ నేతలకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. సమస్యలపై ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ఆపలేక.. కొనసాగించలేక నేతలు సతమతమవుతున్నారు.

 ఇదీ జిల్లాలో పరిస్థితి...
- శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు.
- ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు వరుసగా రెండురోజులు నిలదీతలు ఎదురయ్యాయి. జి.సిగడాం మండలం ఆనందపురం, ఆబోతులపేట, దవళపేట, విజయరాంపురం గ్రామాల్లో పర్యటించారు. విజయరాంపురంలో అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు ఓట్లేసిన ప్రజల ఓపిక నశించి ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. తమ గ్రామంలోకి రావద్దంటూ స్పష్టం చేశారు.  ఆనందపురంలో కూడా ‘అర్హులమైనా తమకు ప్రభుత్వ పథకాలు ఎందుకు వర్తింపజేయడం  లేదు’ అని గ్రామస్థులు నిలదీశారు.
- పాతపట్నం నియోజకవర్గం తెంబూరులో.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి పర్యటించారు. నిత్యావసర ధరలు పెంపు, తాగునీటి సమస్యలపై ప్రజలు నిలదీశారు.
- పలాస నియోజవకర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురంలో ఆయన పర్యటించారు. ధరలు విపరీతంగా పెంచేసి ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారని ఓ మహిళ..  ఆయనను నిలదీసింది. టీడీపీ హయాంలో తనకు వచ్చిన పింఛన్‌ రద్దయిందని ఓ వృద్ధురాలు వాపోయింది.
- నరసన్నపేట నియోజకవర్గంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కృష్ణదాస్‌ పర్యటిస్తున్నారు. జలుమూరు మండలం రాయిపాడు పంచాయతీలో ఆయన పర్యటించగా.. ప్రజలు ఎన్నో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకు పంటలు లేవని.. ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని ఏకరువు పెట్టారు.  
- ఆమదాలవలస నియోజకవర్గంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పర్యటిస్తున్నారు. బూర్జ మండలంలో ఓ సర్పంచి.. తనకు చెక్‌పవర్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
జిల్లాలో దాదాపు అన్నిచోట్లా ప్రజలు సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ప్రశ్నించలేని కొందరు సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు.

 చెప్పిందొకటి... చేసిందొకటి
‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గ్రామ/వార్డు పరిధిలో లబ్ధిదారుల జాబితా సేకరించాలి. వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల వివరాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారపార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లాలి. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రేపు ఫలానా గ్రామంలో నాయకులు పర్యటించాలంటే.. ముందుగా ఆ గ్రామంలో తమకు అనుకూలమైన అంశాలు.. ప్రతికూల విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికమంది వైసీపీకి చెందినవారే. ప్రతిపక్షం లేకపోవడం... సమస్యలు కుప్పలుగా ఉన్నా వాటిపై ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేవారు లేరు. దీంతో తమ వద్దకు వచ్చే నాయకులనే నిలదీయాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చింది. ఇటువంటివి ముందుగానే గమనించి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోకుండా... సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొక్కుబడిగా కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు. ఇంకా సమస్యలపై గొంతెత్తితే.. పోలీసులతో వారిని నియంత్రిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో మూడు నాలుగిళ్లకు మాత్రమే వెళ్లి.. కార్యక్రమాన్ని ముగించేస్తున్నారు.

 నిలదీతలకు కారణాలు ఇవీ...
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కాగా.. నియోజకవర్గాల్లో నేతలు సక్రమంగా పర్యటించలేదు. సమస్యలపై దృష్టి సారించలేదు. ఏ గ్రామంలో చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కాలువలు నిర్మించలేదు. సచివాలయాల ద్వారా పాలన సాగుతున్నా... మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రజలకు అన్నిచోట్లా ఇబ్బందులే. గతంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లించడం లేదు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలకు బిల్లులు ఇవ్వడం లేదు. ఇళ్ల నిర్మాణ బిల్లులదీ అదేతీరు. మరోవైపు పెట్రోల్‌, గ్యాస్‌, కరెంటు.. ఇతర నిత్యావసరాలు ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిపైనా నాయకులను నిలదీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రైతుభరోసా, జగనన్న చేదోడు, విద్యాదీవెన తదితర పథకాలకు సంబంధించి అర్హత ఉన్నా.. చాలామందికి లబ్ధి చేకూరడం లేదు. వీటిపైనా ప్రశ్నలు తలెత్తుతుండడంతో నేతలు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.