ప్రభుత్వాన్ని రక్షించుకుందాం

ABN , First Publish Date - 2022-05-28T06:36:51+05:30 IST

జగన్‌ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పడగొట్టాలని కక్షకట్టాయి. ఈ ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

ప్రభుత్వాన్ని రక్షించుకుందాం
సామాజిక న్యాయ భేరి సభలో మాట్లాడుతున్న హోం మంత్రి తానేటి వనిత, చిత్రంలో మంత్రులు బొత్స, ధర్మాన, కారుమూరి, వేణు, పినిపే, రజనీ తదితరులు

జగన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు..

సామాజిక న్యాయ భేరి సభలో మంత్రులు


రాజమహేంద్రవరం, మే27(ఆంధ్రజ్యోతి) : జగన్‌ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పడగొట్టాలని కక్షకట్టాయి. ఈ ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక మున్పిల్‌ స్టేడియంలో  శుక్రవారం జరిగిన వైసీపీ సామాజిక న్యాయభేరిలో ఆయన మాట్లాడారు. లక్షా 20 వేల కోట్ల పంపిణీలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాంక్‌ ఖాతాల్లోనే వేసినట్టు చెప్పారు.  హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతిరావుపూలే, కొమరం భీమ్‌ వంటి ఎందరో మహానుభావులు  బలహీన వర్గాల అభివృద్ధికి వేసిన బాటలో సీఎం జగన్‌ నడుస్తున్నారన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ  జగన్‌ అంటే పేదలకు భరోసా అన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ బలహీన వర్గాల కోసం ఆలోచించలేదని, అది కేవలం జగన్‌ వల్లే సాధ్యమైందని చెప్పారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ  అన్నివర్గాల అభ్యున్నతికి జగన్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. అయితే సభకు పలు నియోజకవర్గాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. 4 గంటలకు ప్రారంభం కావాల్సిన సభకు 7 గంటలకు నాయకులు వచ్చారు. 3 గంటల పాటు వేచి ఉండి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. దాదాపు 5 గంటల నుంచే జనం తిరుగుముఖం పట్టడంతో రాజమహేంద్రవరం రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. సభా ప్రాంగణం మాత్రం జనం లేక వెలవెలబోయింది.  సభకు  వివిధ సామాజికి వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు హాజరయ్యారు. మం త్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌, ఎంపీ లు పిల్లి సుభాష్‌చంద్రబోసు,మార్గాని భరత్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు.


దెబ్బతిన్న ట్రాఫిక్‌ ప్లానింగ్‌..


రాజమహేంద్రవరం అర్బన్‌, మే 27 : వాహనాల పార్కింగ్‌కు ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానం కేటాయించినా ఒక్క వాహనం కూడా పార్కింగ్‌ చేయలేదు. స్వామి-అశోక థియేటర్ల కూడలిలో బందోబస్తు నిర్వహించిన పోలీసులు ద్విచక్రవాహనదారులు, ఇతర ప్రయాణీకుల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. పోలీసులు ఈ రూటులో ఎక్కడా పార్కింగ్‌కు స్థలం కేటాయించకపోయినా  సభకు జనాలను తరలించే ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాలను తాడితోట సెంటర్‌ వరకూ అనుమతించారు. సభకు వచ్చేవారికి మార్గాని ఎస్టేట్స్‌ గ్రౌండ్‌లోనూ వాహనాల పార్కింగ్‌ ఇవ్వడంతో ఈ రూటులో విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి విశాఖపట్నం, కాకినాడ వైపు వెళ్లే బస్సులన్నీ ఇదేమార్గంలో ప్రయాణించడంతో సమస్య మరింత జటిలంగా మారింది. కొవ్వూరు, ఏలూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇదే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వచ్చింది.   




Updated Date - 2022-05-28T06:36:51+05:30 IST