Share News

YCP MANIFESTO STORY : ముంచావు కదా జగన

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:50 AM

వైసీపీ అధినేత, సీఎం జగన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ‘కొత్త సీసాలో పాత సారా’ అని జనం పెదవి విరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫేస్టోనే మళ్లీ విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఏదో ఉంటుందని ఆశించిన వైసీపీ అభ్యర్థులు మరింత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన బటన నొక్కుడుకే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని మరిచారు. ఇదే అంశం అభ్యర్థులను భయపెడుతోంది. ప్రజలకు ఏం చెప్పి ఓట్లు ...

YCP MANIFESTO STORY : ముంచావు కదా జగన

మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదే..

ఇప్పుడు జనంలోకి ఎలా వెళ్లాలి..?

వైసీపీ అభ్యర్థుల్లో గుబులు.. దిగులు

టీడీపీ సూపర్‌ సిక్స్‌ ముందు దిగదుడుపు

పింఛన, ఉద్యోగాలు, రైతు భరోసా.. అన్నీ అంతే..

వైసీపీ అధినేత, సీఎం జగన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ‘కొత్త సీసాలో పాత సారా’ అని జనం పెదవి విరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫేస్టోనే మళ్లీ విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఏదో ఉంటుందని ఆశించిన వైసీపీ అభ్యర్థులు మరింత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన బటన నొక్కుడుకే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని మరిచారు. ఇదే అంశం అభ్యర్థులను భయపెడుతోంది. ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి తరుణంలో మేనిఫెస్టో తమకు ఊపిరినిస్తుందని అభ్యర్థులు భావించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. 175కు 175 స్థానాలు గెలవబోతున్నామని ముఖ్యమంత్రే చెబుతుంటే.. మేనిఫేస్టోలో ఏదో అద్భుతం ఉంటుందని వైసీపీ అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగారు. మేనిఫెస్టో చూసిన తరువాత ఉసూరుమన్నారు.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం


వైసీపీ అభ్యర్థుల్లో అలజడి

పాత మేనిఫెస్టోతోనే ప్రజల్లోకి వెళ్లాల్సి రావడంతో వైసీపీ అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. మేనిఫేస్టో విడుదల చేయకపోయా ఏదోలా ప్రచారం చేసుకునేవారమని, బటన నొక్కుడు కార్యక్రమాన్ని చెప్పుకొనైనా ప్రజల్లోకి వెళ్లి ఉంటే కొంతలో కొంత బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు పాత అంశాలతో వెళితే పరువుపోతుందని ఆవేదన చెందుతున్నారు. టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలతో పోలిస్తే.. వైసీపీ మేనిఫెస్టో అంశాలు ప్రజలను ఉత్తేజపరిచేలా లేవన్న అభిప్రాయం వైసీపీ అభ్యర్థుల్లో వ్యక్తమౌతోంది. ప్రతి నెలా రూ.4 వేల పింఛన ఇంటి వద్దే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ జగన అంతకంటే తక్కువ పింఛన ఇస్తామనడం ఏమిటో అర్థం కాలేదని వైసీపీ అభ్యర్థులు వాపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ గురించి మేనిఫెస్టోలో క్లారిటీ లేదు. దీంతో నిరుద్యోగ యువత ఓట్లు వైసీపీకి అవసరం లేదనే సంకేతాలను జగన పంపినట్లుందని ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా సొమ్ము పెంపు విషయంలోనూ టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలతో పోలిస్తే వెనకడుగే శారు.


దీంతో రైతులు సైతం వైసీపీకి దూరమౌతారన్న భావన వ్యక్తమౌతోంది. మహిళలకు, విద్యార్థులకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలోనూ మేనిఫెస్టోలో తప్పటడుగులే కనిపించాయనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది.

మరింత ఇరకాటం

గత ఎన్నికల్లో కరువు జిల్లా అనంతకు ఇచ్చిన హామీల అమలు విషయాన్ని మేనిఫెస్టోలో ప్రత్యేకంగా కనబరచలేదు. హంద్రీనీవా విస్తరణ, హెచఎల్సీ ఆధునికీకరణ, భైరవానతిప్ప, పేరూరు, ఉంతకల్లు, రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం హామీని జగన నెరవేర్చలేదు. ఈ హామీలు సైతం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీ అభ్యర్థులను మరింత ఇరకాటంలో పడేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


సూపర్‌ సిక్స్‌..

వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలే భేష్‌ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ఏడాదికి రూ.16 వేలు ఇస్తామన్నారు. అందులో కేంద్రం వాటా రూ.6 వేలు ఇప్పటికే అమలవుతోంది. సూపర్‌సిక్స్‌లో భాగంగా రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీనికి తోడు 90శాతం సబ్సిడీతో రైతుకు డ్రిప్‌, స్ర్పింక్లర్లు ఇస్తామన్నారు. పింఛన విషయంలో వైసీపీ వెనకడుగు వేసింది. మొదటి మూడేళ్లు రూ.3 వేలు, ఆ తరువాత 2028లో రూ.250, 2029లో మరో రూ.250 పెంచుతామని చెప్పారు. మొత్తం మీద రూ.3500 ఇస్తామని జగన ప్రకటించారు. టీడీపీ మాత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఏకంగా రూ.4 వేలు ఇస్తామని పేర్కొంది. దివ్యాంగులకు పింఛన రూ.6 వేలు, అమ్మఒడి పథకం ద్వారా ఇక నుంచి రూ.17 వేలు ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో జగన ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా... ఒకరికే ఈ పథకం వర్తిస్తోంది. టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాల్లో తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలున్నా.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.


మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బాబు స్పష్టం చేశారు. ఉద్యోగం వచ్చేంత వరకూ నెలకు రూ.3 వేలు యువగళం నిధి కింద భృతి ఇస్తామన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. 50 ఏళ్లు పైబడిన బీసీలకు పింఛన అమలు చేస్తామన్నారు. ఇలా వైసీపీ మేనిఫేస్టోకి, టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలతో పోలిస్తే పొంతన లేదనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

కూటమిదే అధికారం

వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు, వివిధ అంశాలను పరిశీలించిన తరువాత ఈ ఎన్నికల్లో కూటమిదే విజయమని, కూటమిదే అధికారమని మేధావి వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు సిద్ధాంతమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల బటన నొక్కుడుకే అధిక ప్రాధాన్యమిచ్చారని, అభివృద్ధి దిశగా ఆశించినంత స్థాయిలో చొరవ చూపలేదని ఆ వర్గాలు అంటున్నాయి. కరువు జిల్లా అనంతలో టీడీపీ, వైసీపీ పాలనలలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ కియతోపాటు అనుబంధ పరిశ్రమలను జిల్లాకు తెచ్చింది. దీంతో ప్రత్యక్షంగా 8 వేల మందికి.. పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. ఏ ఒక్కరికీ ఉద్యోగావకాశాలు దక్కలేదు. అన్ని రంగాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:50 AM