Share News

Hyderabad: ప్రియుడి కోసం పెద్దమ్మ నగలు చోరీ.. తోడుకోసం తీసుకొస్తే 16 తులాల బంగారు నగలు అపహరణ

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:09 AM

తన పిల్లలకు తోడుగా ఉంటుందని తీసుకొస్తే పెద్దమ్మ నగలనే కాజేసింది. ప్రియుడి మోజులో పడిన బాలిక 16 తులాల నగలు, రూ.1.5 లక్షలను అతడికి ఉదారంగా అందజేసి ఏమీ తెలియనట్లుగా నటించింది.

Hyderabad: ప్రియుడి కోసం పెద్దమ్మ నగలు చోరీ.. తోడుకోసం తీసుకొస్తే 16 తులాల బంగారు నగలు అపహరణ
Gold Robbery

- సోషల్‌ మీడియాలో పరిచయమైన ప్రియుడికి అప్పగింత

- యువకుడి అరెస్టు

హైదరాబాద్: తన పిల్లలకు తోడుగా ఉంటుందని తీసుకొస్తే పెద్దమ్మ నగలనే కాజేసింది. ప్రియుడి మోజులో పడిన బాలిక 16 తులాల నగలు, రూ.1.5 లక్షలను అతడికి ఉదారంగా అందజేసి ఏమీ తెలియనట్లుగా నటించింది. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఆర్‌.గిరిధర్‌, ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. చిలకలగూడ పోలీస్‏స్టేషన్‌(Chilakalaguda Police Station) పరిధిలో ఉంటున్న దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. భర్త నగరంలో పనిచేస్తుండగా, భార్య ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో ఉద్యోగం చేస్తూ చెల్లెలు ఇంట్లో ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. నగరంలో ఉంటున్న వీరికి తోడు కోసం మహిళా ఉద్యోగి చెల్లెలి కుమార్తెను ఇక్కడకు తీసుకొచ్చారు. ఆమెను స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి చదివిస్తున్నారు. అయితే, కడప జిల్లా పెంటలమర్రి మండలంలోని వేలూరుపాడు గ్రామానికి చెందిన చెప్పలి విజయ్‌ కుమార్‌రెడ్డి (19) బెంగళూరులో పీజీ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. బాలిక అతనికి స్నాప్‌చాట్‌లో పరిచయమైంది. ఆ పరిచయంతో అతడు నగరానికి వచ్చి తరచూ ఆమెను కలిసేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. అయితే, అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రులను ఆస్పత్రిలో చూపించాలంటే డబ్బులు అవసరమని బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.

ఇదికూడా చదవండి: Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

16 తులాల బంగారం అప్పగింత..

అతడి మాయమాటలను నమ్మిన సదరు బాలిక పెద్దమ్మ ఇంట్లోని ఆమె నగలను తస్కరించి స్నేహితురాలి సాయంతో కుదువపెట్టింది. పలు దపాలుగా విజయ్‌కుమార్‌రెడ్డికి రూ.1.5లక్షలను యూపీఐ ద్వారా పంపించింది. తర్వాత మరికొద్ది రోజులకు మరో 16 తులాల బంగారాన్ని యువకుడికి ఇచ్చింది. కాగా, ఏప్రిల్‌ రెండో తేదీన బాలిక పెద్దనాన్న తన జేబులో ఉన్న రూ.3వేల నగదు కనిపించకపోవడంతో అప్రమత్తమయ్యాడు. బాలికపై అనుమానమొచ్చిన అతను తన భార్య, మరదలకు ఫోన్‌ ద్వారా విషయాన్ని తెలిపాడు. ఈ మేరకు అతడి భార్య చిలకలగూడలోని తన ఇంటికి వచ్చి బంగారు ఆభరణాలను వెతకగా.. ఒక్కటి కూడా కనిపించలేదు. దీంతో వారు ఇంట్లో బంగారు నగలు కనిపించడంలేదని ఏప్రిల్‌ 2న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు బాలిక సెల్‌ఫోన్‌ను చెక్‌ చేయగా స్నాప్‌చాట్‌లో విజయ్‌కుమార్‌రెడ్డితో చాటింగ్‌ చేసినట్లు గుర్తించి ఆధారాలను సేకరించారు. అనంతరం బాలికను విచారించగా నగదు, నగలు యువకుడికి ఇచ్చినట్లు అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి నుంచి రూ.9.06 లక్షలు విలువజేసే 16తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాలిక పంపిన డబ్బులు, బంగారు నగలను కుదువపెట్టి తీసుకున్న డబ్బులతో విజయ్‌కుమార్‌రెడ్డి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, బైక్‌ రైడింగ్‌, ధూమపానం, మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. విజయ్‌కుమార్‌రెడ్డిపై పోక్సోతో పాటు దొంగతనం కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలు, సిబ్బందిని డీసీపీ, ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో డిటిక్టెవ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమే్‌షగౌడ్‌, డీఎస్సై ఆంజనేయులు, ఎస్సై కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు 10.. బీజేపీకి 5

Updated Date - Apr 17 , 2024 | 09:45 AM