Share News

Lok Sabha Elections 2024: నవాబులు, నిజాంలపై ఈగ కూడా వాలనీయరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:36 PM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యువరాజు (రాహుల్) దేశాన్నేలిన రాజులు, మహారాజులను అగౌరపరుస్తూ, నవాబులు, నిజాంలు, బాద్‌షా‌లపై అకృత్యాలపై మాత్రం నోరు మెదపరని విమర్శించారు.

Lok Sabha Elections 2024: నవాబులు, నిజాంలపై ఈగ కూడా వాలనీయరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

బెళగవి: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యువరాజు (రాహుల్) దేశాన్నేలిన రాజులు, మహారాజులను అగౌరపరుస్తూ, నవాబులు, నిజాంలు, బాద్‌షా‌లపై అకృత్యాలపై మాత్రం నోరు మెదపరని విమర్శించారు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబ్‌ను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ విమర్శించిన పాపన పోలేదని అన్నారు.


కర్ణాటకలోని బెళగవిలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ఇండియానేలిన రాజులు అకృత్యాలు చేసి పేద ప్రజల ఆస్తులు కొల్లగొట్టారని కాంగ్రెస్ షెహజాదా (రాహుల్) చెబుతుంటారని, సుపరిపాలన, దేశభక్తికి ప్రతీకలైన ఛత్రపతి శివాజీ మహరాజ్, రాణి చిన్నమ్మ వంటి గొప్ప యోధులను విమర్శిస్తుంటారని అన్నారు. మనమంతా గర్వించే మైసూరు రాజకుటుంబం సేవలు షెహజాదాకు తెలియవా? అని ప్రధాని ప్రశ్నించారు.

RSS: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..


రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో జరిగిన ర్యాలీలో ప్రజల భూములను రాజులు, పాలకులు లాక్కున్నారని, దేశానికి స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చి రాజ్యాంగాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీనే వీటిని అడ్డుకుందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మోదీ బెళగవి ప్రసంగంలో తూర్పారబడుతూ, కేవలం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ షెహజాదా ఈ వ్యాఖ్యలు చేస్తు్న్నారని అన్నారు. వేలాది హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఔరంగజేబ్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాడని ఎద్దేవా చేశారు. మన పర్యాటక స్థలాలను ధ్వంసం చేసి, సంపదను దోచుకుని, ప్రజలను, గోవులను చంపిన వారిపై గొంతు పెగలదని అన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీకి ఏర్పాటు చేసేందుకు బెనారస్ రాజు సాయం చేశారని, బీఆర్ అంబేడ్కర్‌లోని ప్రతిభను బరోడా మహారాజు గుర్తించారని ప్రదాని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే శాంతి భద్రతలు క్షీణించడం మొదలైందని విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 05:36 PM