Share News

Andhra Pradesh: మంత్రా మజాకా..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:49 AM

వసూళ్ల వ్యవహారం మొత్తం సీనియర్‌ మంత్రి పేషీ కేంద్రంగానే జరిగింది. తొలుత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి టీచర్లు సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు.

Andhra Pradesh: మంత్రా మజాకా..!
Andhra Pradesh

  • ఎన్నికల ముందు సిఫారసుల బది‘లీలలు’

  • 653 మంది టీచర్ల అక్రమ బదిలీలకు ఓకే

  • వారి జీతాల కోసం ర్యాటిఫికేషన్‌ ఉత్తర్వులు

  • అంతకుముందు మరో 600 మంది బదిలీ

  • ఒక్కో బదిలీకి రూ.4 నుంచి రూ.5 లక్షలు

  • ఎన్నికలకు ముందు భారీగా దోచేసిన మంత్రి

  • రూ.50 కోట్ల మేర దండుకున్న వైనం

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘మా ప్రభుత్వంలో అక్రమాలకు చోటు లేదు. అంతా పారదర్శకమే. అసలు అవినీతి ఊసే ఉండదు..’ వైసీపీ(YSRCP ప్రభుత్వంలోని ఓ సీనియర్‌ మంత్రి తరచూ వల్లెవేసే నీతి వాక్యాలివి.! ఆయన మాటలు వింటే.. అంతా నిబంధనల ప్రకారమే చేస్తారు కాబోలు అని అందరూ భ్రమపడతారు. ఏదైనా సిఫారసు బదిలీ కావాలని ఆయన వద్దకు వెళ్లాలన్నా జంకుతారు. అయితే ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. ఏ నోటితో అయితే అంతా పారదర్శకం అన్నారో ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే పాఠశాల విద్యాశాఖ అడ్డగోలు బదిలీలు చేసింది. అది కూడా ఒకటి.. రెండు కాదు ఏకంగా 1,200 మంది టీచర్లను సాధారణ బదిలీల అనంతరం అక్రమంగా బదిలీ చేసింది. ఒక్కో అక్రమ బదిలీకి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు మంత్రిగారి ఖాతాకు వెళ్లాయి. అందులో 653 మందిని ఎన్నికలకు రెండు నెలల ముందు బదిలీ చేయడం గమనార్హం. తాజాగా చేసిన ఈ అక్రమాల తతంగానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు ఆమోద ముద్ర వేసింది. ఇలా అక్రమంగా బదిలీ చేసిన 653 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల జీతాలకు ఇబ్బంది రాకుండా ట్రెజరీ శాఖతో సమన్వయం చేసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తాజాగా రాటిఫికేషన్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే వీరిని ఎన్నికల కోడ్‌ అనంతరం రిలీవ్‌ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన టీచర్లు ఇంకా కొత్త పాఠశాలలకు వెళ్లకపోయినా సీనియర్‌ మంత్రికి మాత్రం దాదాపు రూ.50 కోట్ల మేర ముడుపులు అందాయి. ఆ మంత్రిగారి కుటుంబంలో ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఈ ముడుపులు ఎన్నికల ఖర్చులకు సరిపోతాయిలే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా ఆ మంత్రిలో పేషీలోని అనధికారిక అధికారులు, పాఠశాల విద్యాశాఖలో కొందరు అధికారులు, సచివాలయంలోని అధికారులు భారీగా జేబులు నింపుకొన్నారు.


కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు..

పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం 1.7లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న శాఖ మరొకటి లేదు. అందువల్ల బదిలీల్లో కౌన్సెలింగ్‌ విధానాన్ని అమలుచేస్తున్నారు. అక్రమాలకు అవకాశం ఉండకూడదని టీచర్లు ఏళ్లపాటు పోరాటం చేసి ఈ కౌన్సెలింగ్‌ విధానాన్ని సాధించుకున్నారు. అయినా కౌన్సెలింగ్‌ అనంతరం అడపాదడపా కొంతమంది టీచర్లను ప్రభుత్వం సిఫారసుల పేరిట బదిలీలు చేయడం సర్వసాధారణంగా మారింది. గత ప్రభుత్వాల్లో ఈ తరహా బదిలీలు స్వల్పంగా ఉండేవి. కానీ, వందల సంఖ్యలో అక్రమంగా సిఫారసు బదిలీలు చేసుకోవచ్చనే విధానానికి జగన్‌ ప్రభుత్వం నాంది పలికింది. సిఫారసు బదిలీలు అవుతాయన్న నమ్మకంతోనే కొందరు టీచర్లు తెలివిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవట్లేదు. బదిలీలన్నీ ముగిశాక కావాల్సిన పాఠశాల కోరుకుని దర్జాగా అక్కడకు వెళ్లిపోతున్నారు. పాఠశాల విద్యాశాఖలో పెద్దఎత్తున ఖాళీలు ఉన్నందున ప్రతి పాఠశాలలోనూ కొన్ని టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటాయి. అక్రమ బదిలీలు కోరుకునే వారికి ఇదే వరం అవుతోంది. ఏ పాఠశాలకైనా ఇష్టమొచ్చినట్లు బదిలీ చేయించుకునే వెసులుబాటు దొరుకుతోంది. దీనిపై ఇప్పుడు టీచర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా వందల సంఖ్యలో అక్రమ బదిలీలు చేయడంతో ఇకపై సాధారణ బదిలీలు నామమాత్రంగా మారిపోతాయని భయపడుతున్నారు.


పేషీలోనే వసూళ్ల వ్యవహారం

వసూళ్ల వ్యవహారం మొత్తం సీనియర్‌ మంత్రి పేషీ కేంద్రంగానే జరిగింది. తొలుత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి టీచర్లు సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు. వాటిని చూపించి మంత్రి కార్యాలయం దోపిడీకి తెరతీసింది. మొదట అలాంటి అక్రమ బదిలీలు తనకు ఇష్టం లేదన్నట్లు మంత్రి అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో ఎలాగైనా బదిలీ కావాలని కోరుకునే టీచర్లు కొందరు మంత్రి పేషీలోని వారికి ముడుపులు సమర్పించుకున్నారు. అలా అందరూ ఎంతో కొంత ఇచ్చుకున్న తర్వాత బదిలీలు చేయాలని మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. తొలుత ఇష్టం లేదన్నట్టు వ్యవహరించడం కూడా వసూళ్ల వ్యవహారంలో భాగమేనని టీచర్లు తర్వాత అర్థం చేసుకున్నారు. సిఫారసు లేఖలు తెచ్చుకున్న వెంటనే బదిలీలు చేసి ఉంటే మంత్రి కార్యాలయానికి ముడుపులు అందవు. అందుకే మొదట ఇష్టం లేదన్నట్టు వ్యవహరించిన మంత్రి, ఆ తర్వాత ముడుపులు చేతికందగానే బదిలీలు చేయాలని ఆదేశించారు. ఇలా పక్కా ప్లాన్‌తో రెండు దశల్లో 1,200 మంది టీచర్లను అడ్డదారిలో బదిలీ చేశారు. కాగా, ముడుపులు ఇవ్వకుండా ఏవైనా కారణాలతో బదిలీలు కావాలని అడిగిన వారి దరఖాస్తులను మాత్రం పక్కనపెట్టేశారు.

For More Andhra Pradesh and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 07:39 AM