Share News

Rahul Gandhi: కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఏముంది మోదీ చెబుతున్నదేమిటి?

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:19 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలతో మొదలుపెట్టి దాదాపుగా అదే అంశంపై ప్రధాని మోదీ

Rahul Gandhi: కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఏముంది మోదీ చెబుతున్నదేమిటి?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలతో మొదలుపెట్టి దాదాపుగా అదే అంశంపై ప్రధాని మోదీ ప్రతిరోజూ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఎన్నికల సభలో ఏకంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉందని చెప్పారు.

‘మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీద, సంపద మీద వారి కన్ను పడింది. తమ ప్రభుత్వం వస్తే ఒక్కో వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు? ఎంత ఆస్తి ఉంది? ఎన్ని వాహనాలున్నాయి? ఎన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి? అనేది దర్యాప్తు జరుపుతామని కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌గాంధీ) చెబుతున్నారు. ఈ సంపదనంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేస్తుంది. వారి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉంది’ అని పేర్కొన్నారు.

మహిళల వద్ద ఉన్న బంగారాన్ని, చివరికి మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్‌ వాళ్లు వదిలిపెట్టరని, దాని గురించి కూడా సమాచారం సేకరించి పంచి పెడతారని, ఈ విషయం కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉందని మోదీ చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి హిందూ-ముస్లిం అంటూ ప్రజల మధ్య విభజన తెచ్చే విధంగా మాటలు మాట్లాడటమేమిటన్న చర్చ దేశంలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇదిలా ఉన్నప్పటికీ.. మోదీ చెప్పినట్లుగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రజల సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేస్తామని ఉందా అన్నది అసలు ప్రశ్న.


వీటిని సహించకూడదు

‘న్యాయ పత్రం’ పేరుతో విడుదలైన కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ‘సామాజిక న్యాయం’ అనే అధ్యాయంలో తొలి పేరా ఇలా ఉంది. ‘దేశంలో వివిధ కులాల, ఉప కులాల సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయటానికి వీలుగా దేశవ్యాప్త సామాజిక ఆర్థిక కులగణన జరుపుతాం. ఆ సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా సంక్షేమ అజెండాను బలోపేతం చేస్తాం’ అని స్పష్టం చేశారు.

ఇదే అధ్యాయంలో ఇచ్చిన పలు హామీల్లో మరొకటి ఇలా ఉంది.. ‘ప్రభుత్వ భూములు, మిగిలి ఉన్న అదనపు భూములను ల్యాండ్‌సీలింగ్‌ యాక్ట్‌ కింద నిరుపేదలకు పంచటానికి ఒక సాధికారికసంస్థను నెలకొల్పుతాం’ అని పేర్కొన్నారు. ఈ హామీలు ఇవ్వటానికి ముందు.. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కాంగ్రెస్‌ మేనిఫెస్టో చర్చించింది... ‘థామస్‌ పికెటీ వంటి అంతర్జాతీయ ఆర్థికవేత్తలు విడుదల చేసిన ‘భారత్‌లో ఆదాయం, సంపద అసమానతలు, 1922-2023: శతకోటీశ్వరుల శకం’ నివేదికలో మోదీ హయాంలో దేశంలో ఆర్థిక అసమానతలు బ్రిటీష్‌ కాలం నాటి కన్నా పెరిగిపోయాయని వెల్లడించింది.


దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్‌ (నెలకు ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యం)పై ఆధారపడుతున్నారంటే దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ప్రపంచ ఆకలి సూచీలో ఉన్న 125 దేశాల్లో భారత్‌ 111వ ర్యాంకులో ఉంది. యూపీఏ పదేళ్ల హయాంలో దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు సగటున 6.7 శాతం కాగా, మోదీ పదేళ్ల పాలనలో సగటున 5.9 శాతానికి పడిపోయింది. మరోవైపు, దేశంలో కులవివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. దేశ జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా దాదాపు 70 శాతం ఉన్నా.. ఉన్నత ఉద్యోగాలు, సేవలు, వ్యాపారాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ.

ఇటువంటి అసమానతలు, పుట్టుకతో కూడిన వివక్ష, సమాన అవకాశాల నిరాకరణను ఏ ఆధునిక, ప్రగతిశీల సమాజం కూడా సహించకూడదు. ఈ అసమానతలను తొలగించటానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుంది’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంట్లో పేర్కొన్న పలు సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యల్లో ఒకటి.. సామాజిక ఆర్థిక కుల గణన. అయితే, దీంట్లో ఎక్కడా కూడా ప్రజల సంపదను లెక్కించి పునఃపంపిణీ చేస్తామని చెప్పలేదు. కానీ, ప్రధాని మోదీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో లేని విషయాన్ని ప్రజలకు చెప్పటం గమనార్హం. - సెంట్రల్‌ డెస్క్‌


అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

ముస్లింలకు దేశ సంపదను పంచుతారని మోదీ అంతకుముందు చేసిన వ్యాఖ్యలో కూడా వాస్తవం ఎంతన్నది కూడా ముందుకు వస్తోంది. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన ఓ ప్రసంగాన్ని ఉదహరిస్తూ మోదీ ఈ కామెంట్‌ చేశారు. జాతీయ అభివృద్ధి మండలి’ 52వ సమావేశంలో ‘సమష్టి ప్రాధాన్యతలు’ అనే అంశంపై మన్మోహన్‌ ప్రసంగిస్తూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతికి పథకాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

అభివృద్ధి ఫలాల్లో మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు తగిన వాటా లభించేలా చర్యలు చేపట్టాలి. వనరుల్లో వారికి తొలి ప్రాధాన్యం ఉండాలి’ అని చెప్పారు. దీనిపై అప్పట్లోనే వివాదం చెలరేగటంతో అప్పుడే ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. వనరులపై తొలి ప్రాధాన్యం ముస్లింలకు మాత్రమే కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పిల్లలు, మైనారిటీలందరికీ ఉండాలని ప్రధాని ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ వివరణను పక్కనపెట్టి మోదీ తాజాగా స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ముస్లింలకు దేశ ప్రజల సంపద పంచనుందని వ్యాఖ్యానించారని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 05:19 AM