ఎండలో బండి జాగ్రత్త

ABN , First Publish Date - 2022-05-07T03:58:29+05:30 IST

రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడిప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. బయ టకు రావాలంటేనే జంకుతున్నారు.

ఎండలో బండి జాగ్రత్త
ఎండలో పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలు

- భానుడి ప్రతాపానికి ఇంధనం ఆవిరి
- జాగ్రత్తలు పాటించకపోతే జేబులు ఖాళీ

వాంకిడి మే 6: రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడిప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. బయ టకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 8నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటల లోపు పనులు ముగించుకొని ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎండలో ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేస్తే భానుడి ప్రతాపానికి  పెట్రోల్‌ ఆంఫట్‌ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తెలుకుంటే ఎండలో పెట్రోల్‌ను అదా చేసుకోవచ్చు.
 గరిష్ట ఉష్ణోగ్రతలు
జిల్లాలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. సుమారు 44 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రతలు నమోదువుతున్నాయి. వాహనాల విషయంలో శ్రద్ధ అవసరమని నిపుణు లు సూచిస్తున్నారు. లేకపోతే వాహనం మొరాయించడం తప్పదని అంటున్నారు. వాహనాలను ఎండలో పార్కింగ్‌ చేస్తే ఎండవేడిమికి పెట్రోల్‌ ఆవిరవుతుంది. ముఖ్యంగా పలు కార్యాలయాలు, బస్టాండ్‌ ఇతర హోటళ్ల వద్ద పార్కింగ్‌ స్థలాలు లేవు. దీంతో ఎండలోనే వాహనాలు పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వ్యాపారులు, వివిధ పనుల కోసం వెళ్లినప్పుడు బైక్‌లను ఎండలో పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఎండవేడికి పెట్రోల్‌ ఆవిరై జేబులకు చిల్లులు పడే ప్రమాదం ఉంది.
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వాహనాల పెట్రోల్‌ ట్యాంకుపై మందపాటి కవర్‌ ఉండేట్లు చూసుకోవడంవల్ల కొంత మెర పెట్రోల్‌ ఆవిరికాకుండా చూడవచ్చు.
- ఎండల వేడికి ఇంజన్‌ అయిల్‌ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజన్‌ఆయిల్‌ మార్చాలి.
- సీటు కవర్లు సైతం సాధారణమైనవి అయితే త్వరగా వేడెక్కి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వేడెక్కకుండా ఉండేందుకు వెల్‌వెట్‌, పోస్టు క్లాత్‌ సీట్‌ కవర్లు వాడాలి.
- వేసవిలో ఇంజన్‌ గార్డులు తొలగించడం ఎంతో మంచిది. దూర ప్రయాణాలు చేసే వారు మధ్యమధ్యలో బండి ఆపి విశ్రాంతి తీసుకోవడం అవసరం.
- వేసవిలో పెట్రోల్‌ ట్యాంకులో గ్యాస్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్‌ను పార్క్‌ చేసేటప్పడు ఒకసారి ట్యాంక్‌  మూతను తెరిచి మూయాలి.
- ఎండాకాలంలో వాహనాలను నీడలోనే పార్కింగ్‌ చేయాలి. వేసవిలో ఇంజన్‌కు సరిపడా ఆయిల్‌ ఉండేట్లు చూసుకోవాలి. టైర్లు, ట్యూబ్లు కూడా మంచిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తలు తీసుకోవాలి
 - సదాశివ్‌, బైక్‌ మెకానిక్‌    

వేసవిలో వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. భానుడి ప్రతాపానికి పెట్రోల్‌ ఆవిరై పోతుంది. ఎండ తీవ్రత వల్ల ప్రమాదవశాత్తు మంటలు చెలరేడి వాహనాలు కాలిపోయే ప్రమాదం ఉంది. ఎండా కాలంలో వాహనాలకు మందంగా ఉంన్న ట్యాంక్‌, సీటు కవర్లు వేసుకొని నీడలో పెట్టుకోవడం మంచిది.

Read more