అవసరమైన వేళల్లో ఎగిరిపోకండి, రాహుల్!

ABN , First Publish Date - 2022-05-05T10:05:40+05:30 IST

కెసిఆర్‌ను మరీ తేలికగా తీసిపారేసేవాళ్లు ఉంటారు. ఆకాశానికి ఎత్తే వాళ్లూ ఉంటారు. ఏదైనా ప్రమాదమే. మూడోసారి ఎన్నిక కావడం గురించి ఆయనకు బుగులు పట్టుకున్నదని, తొందరగా మధ్యంతరం పెట్టి అసెంబ్లీ గండం గట్టెక్కి వారసుడికి...

అవసరమైన వేళల్లో ఎగిరిపోకండి, రాహుల్!

కెసిఆర్‌ను మరీ తేలికగా తీసిపారేసేవాళ్లు ఉంటారు. ఆకాశానికి ఎత్తే వాళ్లూ ఉంటారు. ఏదైనా ప్రమాదమే. మూడోసారి ఎన్నిక కావడం గురించి ఆయనకు బుగులు పట్టుకున్నదని, తొందరగా మధ్యంతరం పెట్టి అసెంబ్లీ గండం గట్టెక్కి వారసుడికి అధికారం బదలాయించాలని ఆత్ర పడుతున్నారని కొందరంటారు. లేదు, ఆయన భారత రాజకీయాలలోనే పెద్ద చక్రం ఒకటి తిప్పుతున్నారని మరి కొందరంటారు. ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్త కాంగ్రెస్‌తో జతపడకుండా కెసిఆర్ చక్రమే అడ్డుపడిందని గొప్పగా చెబుతారు. చక్రం కాదు, గదా కాదు, అపారమయిన రాజకీయ ధనం పోగుపడినప్పుడు, దాన్ని ప్రయోగించి దేన్నైనా సాధించగలరని నిర్వేదంగా అనేవాళ్లూ ఉంటారు. మనది సంపన్నమయిన పార్టీ, 800 కోట్ల నిధులున్నాయి, బాండ్లున్నాయి అని పార్టీ ప్లీనరీలో ధీమాగా చెప్పుకున్న నేత చేతిలో లెక్కకు చిక్కని ధనరాసులు మరెన్ని ఉంటాయో అన్నది మరొక శంక!


కెసిఆర్‌కు ఉన్న చాకచక్యం, చాణక్యం ఆయన ప్రతిష్ఠలో భాగాలే. ఆయన రాజకీయాలతో ఏకీభవించకపోయినా, కొన్ని సన్నివేశాలను ఆయన నిర్వహించే పద్ధతి ఎవరికైనా గౌరవ భావాన్ని కలిగింపజేస్తుంది. కానీ, ఎక్కువ కాలం ప్రశంసార్హ స్థానంలో ఉండడం ఆయనకు ఇష్టం ఉండదు. ఈ మధ్య బిజెపిపై క్రమం తప్పకుండా, నిలకడగా, తనకు తోచిన హేతువులతో విమర్శలు చేస్తూ ప్రత్యామ్నాయ ఎజెండా గురించి మాట్లాడుతున్నందుకు భుజం తట్టాలనిపించే సమయంలో, ఆయనలోని అపరిచితుడు మళ్లీ తలెత్తాడు. ఏమవుతుంది, రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులతో మాట్లాడితే ఏమి ప్రమాదం వస్తుంది? విశ్వవిద్యాలయాలు, వీసీలూ, రిజిష్ట్రార్లూ అధికారాలూ ప్రతిపత్తులూ అంటారు కానీ, అనుమతి ఇవ్వకపోవడానికి వెనుక కారణమేమిటో అందరికీ తెలుసు. అనుమతి ఇచ్చి ఉంటే ప్రజాస్వామ్యవాదివని పొగిడేవాళ్లు కదా? ముళ్లకిరీటం వంటి ఆ పొగడ్త ఎందుకనా సంశయం?


తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ చేసిన సర్వే వాస్తవికమైన అంచనాను ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడే కనుక ఎన్నికలు వస్తే, పరిస్థితి అధికారపార్టీకి నల్లేరునడకగా లేదని ఆ సర్వే తేల్చిందని, ఆ ప్రమాదాన్ని అధిగమించడానికి వ్యూహకర్త కొన్నిసూచలను ఇచ్చారని కూడా కథనాలు వచ్చాయి. ప్రజాస్వామికంగా వ్యవహరించితే, ప్రతిష్ఠపెరుగుతుందని ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారో లేదో తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తనకు ఉండే ఒక ‘ప్రత్యేకమైన అభిప్రాయం’ కారణంగా, ఈ విషయంలో ఎవరి సలహాలనూ కెసిఆర్ వినకపోయి ఉండవచ్చు.


జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ను, తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఇద్దరినీ ఏకకాలంలో క్లయింట్లుగా తీసుకుని, ఒక జమిలి వ్యూహం అల్లిన ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు కాంగ్రెస్‌తో చెడిన తరువాత టిఆర్ఎస్ విజయవ్యూహాన్ని సవరించుకోవలసి వస్తుంది. కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్‌కు వ్యూహ సలహాదారుగా ఉన్న సునీల్ కనుగోలు, తెలంగాణపై కూడా అమిత ఆసక్తి చూపిస్తున్నారట. ఒకప్పుడు బిజెపి కోసం విజయవంతంగా కలసి పనిచేసి, విడివిడిగాను విజయాలు చూసిన ఈ ఇద్దరు వ్యూహకర్తలు తెలంగాణలో పోటీపడే అవకాశం ఉన్నది. కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడితే, ఆ జాడ్యం తెలంగాణకూ సోకగలదన్న భయం టిఆర్ఎస్‌కు కూడా ఉన్నది. బిజెపిని ప్రత్యర్థిగా ఎంచుకుని, దానిని పెంచడం ద్వారా ప్రతిపక్ష ఓట్లు చీల్చవచ్చునని ఒకప్పుడు కెసిఆర్ భావించారని అంటారు. ఆ పద్ధతి వల్ల పెద్దగా ఉపయోగం లేదని, బిజెపికి ఇరవై ఇరవై అయిదు స్థానాలలో తప్ప చెప్పుకోదగ్గ బలం లేదని ప్రశాంత్ కిశోర్ సర్వే చెప్పిందట. అటువంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పెరిగితే?


స్పందన, ప్రతిస్పందనలతోనే ఏ సందర్భమైనా రాజుకుంటుంది. వారం రోజుల నుంచి తెలంగాణలో రాహుల్ పర్యటన ఒక వేడి వేడి చర్చాంశమైంది. ఉస్మానియాలోకి అనుమతిస్తారా లేదా అన్న చర్చ ఉత్కంఠకు, ఉద్రిక్తతకు కూడా దారితీసింది. మరో పక్కన బండి సంజయ్ పర్యటన సాగుతున్నా, బిజెపి జాతీయ అధ్యక్షులు కూడా ఈ సమయంలోనే రాష్ట్రానికి వస్తున్నా, రాహుల్ రాకడ చుట్టూ వార్తలు కమ్ముకుంటున్నాయి. పర్లేదు, గట్టిగా అదిలిస్తే కాంగ్రెస్‌లో కూడా కదలికలు ఉంటాయని అర్థమవుతున్నది. మరి ఆ విషయం రాహుల్ గాంధీకి, ఆ పార్టీలోని ఇతర ఢిల్లీ పెద్దలకు, కలహించుకోవడంలో ఏ మాత్రం రాజీపడని రాష్ట్ర నాయకులకు అర్థం కావాలి. 


రాహుల్ గాంధీ ఏమిటో జనానికి అర్థం కాదు. అతనికి అధికార రాజకీయాలంటే ఏమంత లాలస ఉన్నట్టు కనిపించదు. అట్లాగని, ఆ రాజకీయాలను వదిలివెళ్లరు. ప్రజలు ఎప్పటికో విసిగి వేసారి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించకపోతారా అని వేచి చూస్తున్నట్టు ఉంటారు. అడపాదడపా కొన్ని మంచిమాటలు, కొన్ని ఘాటు విమర్శలు చేస్తారు. బాధ్యత ఇష్టపడరు. బాధ్యతారహిత నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. సమయం సందర్భం చూడకుండా విదేశాలకు వెడుతుంటారు. తాను బాధ్యతాయుత పార్టీకి నాయకుడన్న స్పృహ లేకుండా ఏమంత సదభిప్రాయం కలగని సందర్భాలలో మీడియాకు కళ్లబడతారు. నేపాల్‌లో ఆయన చేసింది తప్పేమీ కాదు. స్నేహితురాలి పెళ్లికి వెళ్లి, ఆమె స్నేహితురాలితో నైట్ క్లబ్‌లో కనిపించడం ఏ రకంగానూ నేరమూ కాదు, అవినీతీ కాదు. కానీ, తప్పకుండా అవాంఛనీయం. ఒకపక్కన విదేశీపర్యటనకు వెళ్లినందుకు ప్రధానిని నిందించి, తాను ఏ సమయంలో ఏమి చేస్తున్నారన్నది ప్రజలు పట్టించుకుంటారు కదా? గతంలో కూడా పార్టీకో, దేశానికో సంక్షుభిత సమయాలలో అతను ఇటలీకో థాయ్‌లాండ్‌కో లండన్‌కో వెళ్లిపోతారు. ఆయన ఇప్పుడు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడే. కానీ, ప్రజలు తనలో ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారని ఆయనకు తెలియదా? బాధ్యతగా ఉండాలి కదా?


ప్రజలు ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రతిపక్షాన్నో, ప్రతిపక్షాలనో కూడా ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యం అంతటితో ముగిసిపోదు. ప్రభుత్వం నుంచి పాలనను, ప్రతిపక్షం నుంచి విమర్శను కోరుకుంటారు. ప్రతిపక్షం ప్రజల హక్కు. కొన్ని సందర్భాలలో ప్రతిపక్షానికి బలం చేకూర్చడం కోసం ప్రజలు అనేక రాజీలకు కూడా సిద్ధపడతారు. వంశ పారంపర్య పాలనో కుటుంబ పాలనో ఏదో ఒకటి, నువ్వు క్రియాశీలంగా ఉండవయ్యా అని రాహుల్ గాంధీని దేశంలోని ఒక గణనీయమైన శ్రేణి కోరుకుంటున్నది. అతను ఆ కుటుంబ పరంపరకు చెంది ఉండడం వల్ల సంక్రమించిన జనబలం, ప్రజాస్వామ్యంలో సమతూకానికి అవసరం అవుతున్నది. పాలకపార్టీ అధికార దుర్వినియోగానికి, ప్రతిపక్షం నిష్క్రియాపరత్వానికి తేడా ఏమున్నది? ప్రశాంత్ కిశోర్ వంటి వృత్తి వ్యూహకర్తలు ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్న విచికిత్సను పక్కనబెట్టి, దేశంలో చెల్లాచెదురుగా ఉన్న విపక్షాన్ని ఒక తాటి మీదకు తేవడానికి ప్రయత్నం జరుగుతున్నందుకు చాలా మంది సంతోషించారు. మరి, అధిష్ఠానపు అతిశయం అడ్డుపడిందో, అన్నాచెల్లెళ్ల పోటీ వీటో చేసిందో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రవేశం ఆగిపోయింది. అతను ఉంటే ఏమి చేయగలిగేవాడో కానీ, అతను చెప్పిన చికిత్సలు బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ మారాలి. తన మీద తనకు పట్టు వచ్చేంతగా అయినా మారాలి. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకున్నా ముఠాలు, పరస్పర కలహాలు ఉండేవి. వాటిని అధిష్ఠానమే, తన అవసరం కొద్దీ ప్రోత్సహించేది. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న కీచులాటలు అటువంటివి కావు. అధిష్ఠానం బలహీనపడడం వల్ల, పార్టీలో సమగ్రత లేకపోవడం వల్ల జరుగుతున్న కలహాలు అవి. బయటి సాయం తీసుకునో, లేక తనంతట తాను శక్తి కూడగట్టుకునో కాంగ్రెస్ నిలబడే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ మీద లేఖాస్త్రం సంధించిన ఇరవై ముగ్గురు నేతల బృందం, పార్టీని మరింత బలహీనం చేసిందా, చైతన్యం నింపిందా, తెలియదు. తమ ఆకాంక్షలకు, ఉద్వేగాలకు నాయకత్వ ఆలంబన కావాలని ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉన్నవారికి అధికారమే స్ఫూర్తి, కాని ప్రతిపక్షంలో ఉన్నవారికి ప్రజల స్పందన మాత్రమే ఉత్తేజాన్ని ఇస్తుంది. సానుకూలత స్పష్టంగా వ్యక్తమవుతున్నా, నీరసపడిపోయే నేతలను, వారి ప్రజలను ఎవరూ రక్షించలేరు.


అనుమతి నిరాకరణ వివాదంతో ఇంధనం అందుకున్న రాహుల్ పర్యటన, కాంగ్రెస్ శ్రేణులకు, ముఖ్యంగా యువకులకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. వ్యక్తమయ్యే స్పందనలను బట్టి, తన వ్యూహానికి కూడా కెసిఆర్ పదును పెట్టుకోవచ్చు. ఎట్లాగైనా ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో టిఆర్ఎస్ ఉన్నది కాబట్టి, సంకల్పం ఉంటే సరిదిద్దుకోవడం పెద్ద కష్టం కాదు. మీటింగులను అడ్డుకోవడం, గృహనిర్బంధాలు చేయడం, తలుపులు పగులగొట్టడం వంటి పద్ధతులను విరమించుకుంటే జనంలో మంచి అభిప్రాయాలు కలుగుతాయి.


కె. శ్రీనివాస్

Read more