డ్రోన్లే బ్రహ్మాస్త్రాలు!

Published: Mon, 09 May 2022 12:36:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డ్రోన్లే బ్రహ్మాస్త్రాలు!

  • యుద్ధ రీతిని మార్చేసిన మానవ రహిత యుద్ధవిమానాలు
  • కొండలాంటి రష్యాను డ్రోన్లతో తెలివిగా ఢీకొంటున్న ఉక్రెయిన్‌
  • భవిష్యత్తు యుద్ధాల్లో వాటిదే కీలకపాత్ర అంటున్న నిపుణులు
  • డ్రోన్ల పరిశోధన, అభివృద్ధిలో 2001 నుంచి అమెరికా ముందంజ
  • చైనా, ఇజ్రాయెల్‌, టర్కీ, రష్యా దేశాల వద్దా విస్తృతంగా డ్రోన్లు
  • తొలి కంబాట్‌ డ్రోన్‌ ‘రుస్తుం-2’ను అభివృద్ధి చేస్తున్న భారత్‌

ఆ రోజు: ఏప్రిల్‌ 14.. స్థలం: నల్లసముద్రం.. దృశ్యం: రష్యా నౌకాదళంలో దాదాపు 40 ఏళ్లుగా సేవలందిస్తున్న బాహుబలి ఓడ.. మాస్క్‌వా.. ఓడెస్సా తీరానికి 60 నాటికల్‌ మైళ్ల దూరంలో మోహరించి ఉంది! నల్ల సముద్రంలో రష్యా ఆధిపత్యాన్ని కాపాడే యుద్ధనౌకల్లో ‘స్టార్‌ హీరో’ అది!! రెండు ఫుట్‌బాల్‌ మైదానాల విస్తీర్ణం.. 186 మీటర్ల పొడుగు.. వందలకొద్దీ సెన్సర్లు, దాడికి వచ్చే శత్రుదేశ విమానాల సమాచార వ్యవస్థలు పనిచేయకుండా చేసే రేడియో జామర్లు, తుపాకులు.. దూసుకొచ్చే ఆపదలను అల్లంతదూరంలోనే కుప్పకూల్చే మూడంచెల క్షిపణి రక్షణ వ్యవస్థ.. మరీ దగ్గరికొచ్చేసిన ముప్పునుంచి రక్షణ కవచంలా కాపాడే ఆటోమేటెడ్‌ ఏకే-630 గ్యాట్లింగ్‌ గన్స్‌.. ఇన్ని ప్రత్యేకతలున్నాయి దానికి!


ఇంతలో ఉక్రెయిన్‌ నుంచి ఒక డ్రోన్‌ ఆ నౌక దిక్కుగా వచ్చింది. దాని వెనకే మరో డ్రోన్‌. అవి టర్కీ నుంచి ఉక్రెయిన్‌ కొనుగోలు చేసిన బేరాక్టర్‌ (టీబీ-2) డ్రోన్లు. వాటిని చూడగానే నౌకలో ఉన్న రష్యన్‌ దళాలు అప్రమత్తమయ్యాయి. వాటినే గమనించడం ప్రారంభించాయి.  వారి దృష్టి డ్రోన్లపై ఉండగానే.. భూనభోంతరాళాలు దద్దరిల్లేలా పెద్ద శబ్దం! పెద్ద పిడుగేదో వచ్చి మీద పడ్డట్టుగా.. అంతటి బాహుబలి నౌకా అల్లల్లాడిపోయింది. పెను జ్వాలల్లో చిక్కుకుని.. చూస్తూచూస్తూండగానే నడిసంద్రంలో మునిగిపోయింది. నాలుగు దశాబ్దాల దాని ఘనచరిత అలా సముద్ర గర్భంలో కలిసిపోయింది!! ఆ నౌకను తామే రెండు ‘ఆర్‌-360 నెప్ట్యూన్‌ క్లాస్‌ యాంటీ షిప్‌’ మిస్సైళ్లతో ధ్వంసం చేసి ముంచేశామని ఉక్రెయిన్‌ సగర్వంగా ప్రకటించుకుంది! అయితే, ఇది పూర్తిగా ఆ మిస్సైళ్ల గొప్పదనం కాదు. ఆధునిక యుద్ధరీతుల్ని తిరగరాస్తున్న డ్రోన్ల గొప్పదనమిది! వాటిని తెలివిగా వాడుకుంటే యుద్ధంలో రష్యాలాంటి సూపర్‌పవర్‌నైనా.. చిట్టెలుక లాంటి ఉక్రెయిన్‌లాంటి దేశం సైతం నిలువరించగలదని నిరూపించిన ఘటన ఇది! ఇదొక్కటే కాదు, ఈ యుద్ధంలో రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్‌ డ్రోన్లనే ప్రధానంగా, విస్తృతంగా వినియోగిస్తోంది. 


యుద్ధం ప్రారంభించిన తొలినాళ్లలో దాదాపు 65 కిలోమీటర్ల మేర విస్తరించిన రష్యన్‌ సైనిక దళాల కాన్వాయ్‌ని ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలకు చెందిన కేవలం 30 మంది డ్రోన్‌ ఆపరేటర్లు క్వాడ్‌ బైకుల సాయంతో ధ్వంసం చేశారు. ఈ యూనిట్‌ పేరు.. ఏరోరోజ్‌విడ్కా. రష్యన్ల కాన్వాయ్‌ని నాశనం  చేయడమే కాదు.. ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్టుపై రష్యా చేసిన గగనతల దాడిని విఫలం చేయడంలో కూడా ఈ విభాగం సహాయం చేసింది. తాజాగా ఒడెస్సాకు సమీపంలో ఉన్న ‘‘స్నేక్‌ ఐలాండ్‌’’లో రష్యాకు చెందిన మరో నౌకను (సెర్నా క్లాస్‌ ల్యాండింగ్‌ షిప్‌)ను టీబీ2 డ్రోన్‌ ద్వారా ధ్వంసం చేసింది.


‘‘ఈసారి విక్టరీ డేను సముద్ర గర్భంలో జరుపుకోండి’’ అంటూ ఎగతాళి చేసింది. అసలీ యుద్ధం మొత్తంలో రష్యాను నిలువరించడంలో ఉక్రెయిన్‌కు కీలకంగా సాయపడుతోంది డ్రోన్లే. ముఖ్యంగా టర్కిష్‌ బేరాక్టర్‌ 2 (టీబీ2) డ్రోన్లు ఉక్రెయిన్‌ చేతుల్లో బ్రహ్మాస్త్రాల్లా మారాయి. వీటితోపాటు.. ఏ1-ఎ్‌సఎం ఫ్యూరీ, లేలేకా-100 డ్రోన్స్‌ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధంలో ట్యాంకులే కీలకపాత్ర పోషించేవి. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని డ్రోన్లు/మానవరహిత విమానాలు భర్తీ చేశాయని.. యుద్ధాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ రంగ పరిశోధకుడు జాన్‌ పారాచిని పేర్కొన్నారు. భవిష్యత్తులో యుద్ధాల్లో గెలుపోటములను డ్రోన్లే నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అమెరికా, చైనా, టర్కీ..

యుద్ధరంగంలో డ్రోన్ల ప్రాముఖ్యాన్ని అందరికన్నా ముందే గమనించిన అమెరికా చాలాకాలంగా వాటిపై పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా 2001 నుంచే ప్రిడేటర్‌ డ్రోన్లను వినియోగిస్తోంది. ఒసామాబిన్‌ లాడెన్‌ కదలికలను గుర్తించడానికి అమెరికా వాడింది ఈ డ్రోన్లనే. అయితే అప్పట్లో కచ్చితత్వం తక్కువగా ఉండేది. 2001లో తాలిబాన్‌ నేత ముల్లా ఓమర్‌పై తలపెట్టిన తొలి డ్రోన్‌ దాడి కచ్చితత్వ లోపం వల్లనే విఫలమైంది. క్రమంగా అమెరికా డ్రోన్లను అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు యూఎస్‌ వద్ద ప్రిడేటర్‌తోపాటు.. రీపర్‌, గ్రే ఈగిల్‌ వంటి కంబాట్‌ డ్రోన్లు ఉన్నాయి. కంబాట్‌ డ్రోన్లే కాదు.. ‘బోయింగ్‌ ఎమ్‌క్యూ 25 స్టింగ్‌ రే’ వంటి రీఫ్యూయెలింగ్‌ డ్రోన్లు కూడా అమెరికా వద్ద ఉన్నాయి. 


తమ విమాన వాహక నౌకలను.. చైనా రూపొందించిన డీఎఫ్‌-21 (డాంగ్‌ ఫెంగ్‌-21) వంటి క్యారియర్‌ కిల్లర్‌ క్షిపణుల నుంచి కాపాడుకునేందుకు అమెరికా వీటిని తయారు చేసింది.  అలాగే.. టర్కీ బేరాక్టర్‌, అంకా ఎస్‌, అక్సుంగుర్‌ వంటి డ్రోన్లతో సత్తా చాటుతుండగా.. చైనా పలు దేశాలకు డ్రోన్లను సరఫరా చేస్తోంది. ప్రపంచంలో సొంతంగా డ్రోన్లు అభివృద్ధి చేసుకోలేని దేశాలకు చైనా అభివృద్ధి చేస్తున్న వింగ్‌లూంగ్‌, సీహెచ్‌-3/3ఏ, సీహెచ్‌4బి, సీహెచ్‌5 వంటి డ్రోన్లే దిక్కు. ఇక, రష్యా వద్ద కూడా.. జలా కేవైబీ, సుఖోయ్‌ ఎస్‌-70 ఒఖోత్నిక్‌-బి (హంటర్‌-బి), గ్రోమ్‌ (థండర్‌), ఓర్లాన్‌-10, ఎలెరాన్‌-3 వంటి అత్యంత శక్తిమంతమైన డ్రోన్లు ఉన్నాయి. - (సెంట్రల్‌ డెస్క్‌)


భారత్‌ కూడా..

ప్రస్తుతం మనదేశం హెరాన్‌, సెర్చర్‌ వంటి ఇజ్రాయిల్‌  తయారీ డ్రోన్లను వినియోగిస్తోంది. అది కూడా ఎక్కువగా నిఘా అవసరాలకే. కానీ, యుద్ధరంగంలో వీటి ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్‌డీవో ‘తప్‌స-బీహెచ్‌-201’ కంబాట్‌ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ‘తప్‌స-బీహెచ్‌-201’ అంటే.. టాక్టికల్‌ ఎయిర్‌బోర్న్‌ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ ఏరియల్‌ సర్వైలెన్స్‌-బియాండ్‌ హొరైజాన్‌-201’ అని అర్థం. వీటినే రుస్తుం-2 డ్రోన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 28 వేల అడుగుల ఎత్తులో 18 గంటలపాటు ఎగరగలవు. ‘సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తీనెస్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ (సెమిలాక్‌)’ నుంచి అనుమతులు రాగానే ఈ డ్రోన్లను సైన్యం అమ్ములపొదిలో చేరుస్తారు. 


ఈ డ్రోన్లు 150 కిలోల దాకా పేలోడ్‌ను మోసుకెళ్లగలవు. సెమిలాక్‌ అనుమతులు వస్తే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తొలి ఐదు తపస్‌ డ్రోన్లను తయారుచేసి సైన్యానికి అందిస్తుంది. 2023 నాటికి మొత్తం 76 తపస్‌ డ్రోన్లను తయారుచేసి ఆర్మీకి 60, వాయుసేనకు 12, నౌకాదళానికి నాలుగు అందించాలన్నది లక్ష్యం. అలాగే.. భారత్‌ ఇప్పుడు ఐదో తరం ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ)’లను డ్రోన్‌ స్వార్మ్‌(గుంపు)లను నియంత్రించగలిగే సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తోంది. ఇవి 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.