మండుతున్న మానవుడు

ABN , First Publish Date - 2022-05-03T09:37:03+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి. రికార్డులు బద్దలవుతున్నాయి. దేశంలోని అత్యధికప్రాంతాలు ఒకేమారు ఇంతగా మాడిపోవడం విచిత్రం. మార్చినెలలోనే సగటు ఉష్ణోగ్రతలు చట్టుబండలై అప్పటివరకూ లేని గరిష్ట ఉష్ణోగ్రతలు...

మండుతున్న మానవుడు

ఎండలు మండిపోతున్నాయి. రికార్డులు బద్దలవుతున్నాయి. దేశంలోని అత్యధికప్రాంతాలు ఒకేమారు ఇంతగా మాడిపోవడం విచిత్రం. మార్చినెలలోనే సగటు ఉష్ణోగ్రతలు చట్టుబండలై అప్పటివరకూ లేని గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయినప్పుడు ప్రమాదం పొంచివున్న విషయం అర్థమైపోయింది. ఈ వేసవితో జాగ్రత్త అంటూ కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే హెచ్చరికలు చేసింది. ఇప్పుడు 120 సంవత్సరాల రికార్డు సృష్టించిన ఉష్ణోగ్రతల గురించీ, కొన్ని చోట్ల ఉపరితల వేడిమి సుమారు డెబ్బయ్ డిగ్రీల వరకూ ఉంటున్న విషయం గురించీ వింటున్నాం.


జాగ్రత్తలు తీసుకోవాలని మా వంతుగా ముందే చెప్పాం అన్నది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు రాసిన లేఖ సారాంశం. వేసవి ప్రభావం గతంలో కంటే మరో అరడజను రాష్ట్రాల్లో పెరిగిందనీ, అనేకచోట్ల ఉష్ణోగ్రతలు ఆరుడిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని హెచ్చరించారాయన. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ఏర్పాట్లను సమీక్షించుకొని అత్యవసరసేవలకూ, సౌకర్యాలకు లోటులేకుండా చూసుకోమనీ, ఓఆర్ఎస్ లూ, ఐవీ ఫ్లూయిడ్లూ సిద్ధం చేసుకోమని చెప్పారాయన. తీవ్ర వేడిమి వల్ల శరీరంపైనా, లోపలా వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో, ఆందోళన, తలనొప్పి, కండరాల బలహీనత, వాంతులు ఇత్యాది సంకేతాలు కనిపించినప్పుడు ఏం చేయాలో, ఎటువంటి జాగ్రత్తలతో భద్రంగా ఉండవచ్చునో కేంద్రం ఈ లేఖలో లోతుగా వివరించింది కూడా. చల్లదనాన్నిచ్చే పరికరాలు అవిచ్ఛిన్నంగా పనిచేసేట్టు చూడాలన్న సూచన కూడా ఇందులో ఉన్నది కానీ, తీవ్రమైన బొగ్గు లోటునూ, సరఫరా కష్టాలనూ చాలా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అది ఎంత కష్టమైన విషయమో కేంద్రానికి తెలియకపోదు. అందుకే సోలార్ విద్యుత్ వంటి సలహాలు ఇస్తున్నది. తీవ్ర ఉష్ణోగ్రతలతో ఫ్యాన్లు, ఏసీలు ఇత్యాది ఉపకరణాల వినియోగం పతాకస్థాయికి చేరితే, మరోపక్క బొగ్గుసరఫరాలో లోటుపాట్లు పెరిగిన డిమాండుకు తగిన విద్యుదుత్పత్తికి మోకాలడ్డాయి. దేశం ఒకేమారు ఈ విషవలయంలోకి జారిపోయింది. గత ఏడాది అక్టోబరులో ఇదే రకమైన సంక్షోభాన్ని దేశం చవిచూసింది. ఇప్పుడు వేసవి వేడిలో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొరత భరించలేనిదిగా తయారైంది. బొగ్గు కొరతకు కారణమేమిటి, అంత హఠాత్తుగా పెద్ద సంఖ్యలో ప్యాసింజర్ రైళ్ళను రద్దుచేసి, బొగ్గు రైళ్ళుగా మార్చాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చీమా చీమా ఎందుకు కుట్టావు అన్న కథలాగా ఉంటుంది. 


‘హీట్ వేవ్’ అని ఎప్పుడు అంటారో, దాని ప్రమాదస్థాయిలేమిటో సమాజానికి తెలుసు. కానీ, సాధారణ కాలంలోనే ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దగా శ్రద్ధపెట్టని ప్రభుత్వాలు వేసవి ఉష్ణోగ్రతలు హద్దులు దాటి ప్రమాదస్థాయికి చేరిన విషయాన్ని గుర్తించి, ప్రకటించి ఉపశమన చర్యలు చేపట్టి, కొన్ని కార్యకలాపాలను సైతం స్తంభిపచేస్తాయని ఆశించలేం. ఐదేళ్ళక్రితం వరకూ వడగాడ్పులను ఎదుర్కొనే విషయంలో జాతీయస్థాయి విధానం అంటూ మనకు లేదు. 2016లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్ డిఎంఎ) కొన్ని మార్గదర్శకాలను రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, పౌరసమాజం ఎటువంటి పాత్ర పోషించాలో వివరించింది. సంక్షోభసమయాల్లో పై స్థాయినుంచి అట్టడుగుస్థాయి వరకూ కలసికట్టుగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఇది ఉపకరిస్తుంది. మార్గదర్శకాలతో పాటు వాటిని అనుసరించాల్సిన సంకల్పం కూడా ఉండాలి. ఈ భయానకమైన వేడిమికి కారణమేమిటన్న ప్రశ్నకు చాలా జవాబులు వింటున్నాం. పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు, ఆర్కిటిక్ వైపునుంచి వీస్తున్న వేడిగాలులు ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి హెచ్చడానికి కారణాలని అంటున్నారు. ఇక, రెండునెలల క్రితం ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) చేసిన హెచ్చరికలు కూడా చాలామందికి గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మీ మనసులు కరిగి, పర్యావరణం మీద ప్రేమ పెరిగి, సత్వరచర్యలకు నడుంబిగించినా చేసిన పాపాన్ని కడుక్కోవడానికి ఎంతో కాలం పడుతుంది అని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో కనీసం ఐదు సందర్భాల్లో ఓ నాలుగు చినుకులు పడి వేడిచల్లారాల్సిన సందర్భాలు గతంలో ఉండేవి. ఇప్పుడు హిమాలయాల్లో తప్ప ఎక్కడా వర్షం పడలేదట. దేశంలో అత్యధికభాగం పొడిబారిపోయి, మండిపోతోంది. మే నెలలో ఉత్తర, పశ్చిమభారతాలు పెద్దగా ఉపశమనం పొందలేకపోయినా, మిగతా భారతదేశం ఇదేస్థాయి ఉష్ణోగ్రతలు ఎదుర్కోకపోవచ్చునన్న వార్త కాస్తంత ఉపశమనం కలిగించేదే. ఏప్రిల్ మాసాన్ని హెచ్చరికగా తీసుకొని ప్రభుత్వాలు వెంటనే ఉపశమన చర్యలకు సంకల్పించడం అవసరం.

Read more