ప్రత్యామ్నాయ పంటలపై సర్కారుగురి

ABN , First Publish Date - 2022-05-03T07:36:40+05:30 IST

గత కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న వరిపంటను పక్కన పెట్టి డిమాండ్‌ ఉన్న పత్తి, సోయాబీన్‌ పంటలసాగుకు ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.

ప్రత్యామ్నాయ పంటలపై సర్కారుగురి
ఆయిల్‌ఫాం సీడ్‌ను పరిశీలిస్తున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి

మినుముల సాగు చేపట్టాలని సూచన 

ఆయిల్‌పాం సాగు లాభదాయకమని సలహా

పత్తి, సోయాబీన్‌లపై దృష్టి పెట్టాలని పిలుపు

రెండు జిల్లాల రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి దిశానిర్దేశం 

ఏఈఓలతో ప్రత్యేక సమావేశం 

ఖరీఫ్‌ పంటలపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష 

నిర్మల్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : గత కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న వరిపంటను పక్కన పెట్టి డిమాండ్‌ ఉన్న పత్తి, సోయాబీన్‌ పంటలసాగుకు ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డిలు వానకాలం పంటలసాగుపై సమీక్ష సమావేశం నిర్వహిచారు. అయితే మంత్రి ఇటు అధికారులతోనూ ముఖ్యంగా ఏఈ ఓలతోనూ సమావేశమై 2014కు ముందు ఆ తరువాత వ్యవసాయస్థితి గతులపైనా అలాగే పంటలసాగు రైతుల పరిస్థితులపైనా సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైతులను పెద్ద ఎత్తున ప్రొత్సాహిస్తోందన్నారు. పత్తిపంటకు ఈ సారి మద్దతు ధర కు మించి ధర పలికిందని, వేరుశనగ పంటకు కూడా రూ.10 వేల వరకు ధర వచ్చిందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పత్తికి అంత ర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉన్న కారణంగా ఆ పంటసాగుకు రైతులు సన్నద్దం కావాలన్నారు. సోయాబీన్‌ పంటకు కూడా ధర ఎక్కువ గా ఉన్న కారణంగా ఆ పంటకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. పత్తి రైతులు లూజు విత్తనాలను కొనుగోలు చేయవద్దని, ప్యాకేజీ విత్తనాలను మాత్ర మే కొనాలని సూచించారు. నకిలీ విత్తనాల నిరోధానికి ప్రత్యేకటాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశామన్నారు. హెచ్‌ఈ కాటన్‌ విత్తనాలను వినియోగించవద్దని కోరారు. భూసారం తగ్గుతున్న కారణంగా రైతులు ఎక్కువగా ఎరువులు, రసాయనాలు వాడవద్దని వ్యవసాయాధికారుల సూచనల మేరకే వాటిని ఉపయోగించాలన్నారు. ఎకరానికి 40 కిలోలకు మించి యూరియాను వినియోగించవద్దని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేయడం, పంటల దిగుబడి పెంచుకోవడంతోనే వ్యవసాయ లాభసాటి అవుతుందన్నారు. రైతులు మూసపద్దతిలో కాకుం డా ఇతర గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. దక్షిణ భారతదేఽశంలో బియ్యం, కందిపప్పు తరువాత మినుములకు అత్యధిక డిమాండ్‌ ఉందని, వినియోగం కూడా ఎక్కువగా ఉన్నందున ఆ పంట సాగుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్‌ పాం పంటలసాగుకు చొరవ తీసుకోవాలని ఈ ఏడాదిలో రాష్ట్రంలో 2 లక్షల నుంచి 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో బైబ్యాక్‌ గ్యారంటీ ఉన్న ఏకైక పంట ఆయిల్‌ పాం మాత్రమేనని అందుకే ఈ పంటను ప్రొత్సాహిస్తున్నామన్నారు. భూమిలో భాస్వరం విఫరీతంగా పెరిగిపోయిందని దీంతో దీనిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ జిల్లాల్లో భూమిలోపలి భాస్వరం కారణంగా పంటల దిగుబడులపై ప్రభావం చూపుతోందన్నారు. రాబోయే ఖరీఫ్‌ నుంచి పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సరఫరా చేస్తామన్నారు. జిల్లాలో మినహా మిగతా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో వైవిధ్యమైన పంటలసాగు చేస్తున్నారని, నిర్మల్‌లో మాత్రం సాంప్రదాయ పంటలకే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. అన్ని వ్యవసాయ క్లస్టర్‌ల పరిధిలో రైతులకు పంటమార్పిడితో పాటు ఆధునిక వ్యవసాయ పద్దతులు, మా ర్కెటింగ్‌, పంటధరలు లాంటి శిక్షణ తరగతులు కొనసాగించాలని కోరా రు. రైతులు పంటమార్పుపై శ్రద్ద వహించాలని, అధికారులు సైతం రైతులను ఇటువైపు మరలించాలన్నారు. ఈ సారి పత్తి, సోయాబీన్‌, మిను ము పంటలను ప్రాధాన్యత పంటలుగా చేసుకొని సాగుకు ఉపక్రమించాలని కోరారు. 

సమస్యలను వినిపించిన ఎమ్మెల్యేలు

పంటల సాగులో ఏర్పడుతున్న ఇబ్బందులను పలువురు ఎమ్మెల్యేలు , మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయారు. ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి మాట్లాడుతూ పాం మేకనైజేషన్‌ కోసం సబ్సిడీ పెంచాలన్నారు. ముథోల్‌ వ్యవసాయ పరిశోధన క్షేత్రానికి చెందిన 40 ఎకరాల స్థలం నుంచి ఐదు ఎకరాల స్థలాన్ని 30 పడకల ఆసుపత్రి కోసం కేటాయించాలని విఠల్‌రెడ్డి కోరారు. అలాగే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిం చాలన్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌ మాట్లాడుతూ ప్రస్తు తం సన్నరకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు. కొత్త మండలాల్లో గోదాంలను నిర్మించాలని ఆమె పేర్కొన్నారు. స్థానికంగా పంటలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. బోథ్‌ ఎమ్మెల్యే బాపురావు కూడా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 

ఏఈఓలతో మంత్రి నిరంజన్‌ రెడ్డి ముఖాముఖి

కాగా జిల్లాలోని పలువురు ఏఈఓలతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఏఈఓ, సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి ఏఈఓ, ఖానాపూర్‌ మండలం సత్తన్‌పెల్లి ఏఈఓ, బోథ్‌ మండలంలోని పాట్నాపూర్‌ ఏఈఓలతో మంత్రి చర్చించారు. 2014 సంవత్సరాని కన్నా ముందు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి గతులపై ఏఈఓలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పంటలసాగు, రైతుల పరిస్థితులు, రైతులకు అందిస్తున్న ప్రొత్సాహకాలు, అలాగే పంట కొనుగోలు, గిట్టుబాటు ధర, ఆధునిక పంటలసాగు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రొత్సాహకాలు లాంటి అంశాలపై మంత్రి ఏఈఓల ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. 

పాక్‌పట్లలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ

ఫ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

రాబోయే రోజుల్లో ఆయిల్‌పాం పంటను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. లాభదాయక పంటలసాగుపై ప్రత్యేకదృష్టి పెట్టి ఆ దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే సోన్‌ మండలంలోని పాక్‌పట్ల గ్రామంలో ఆయిల్‌పాం ప్యాక్టరీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి గ్రామంలో ఆయిల్‌ పాం నర్సరీ కొనసాగుతోందని తెలిపారు. రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు. రాబోయే వానకాలం పంటల కోసం వ్యవసాయశాఖ రూపొందించే ప్రణాళికలను రైతులు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, రాథోడ్‌ బాపురావు, విఠల్‌రెడ్డిలతో పాటు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునంధన్‌రావు, కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ స్నిక్తా పట్నాయక్‌, నిర్మల్‌ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్ల వెంకట్రామ్‌రెడ్డి, అగ్రోస్‌ ఎండీ రాములు, రైతులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 

Read more