ఆరోగ్య సర్వేలలో శుభాశుభాలు

ABN , First Publish Date - 2022-05-14T06:00:26+05:30 IST

పిడికెడు మెతుకులకు అల్లాడుతున్న పేదలను ప్రభుత్వం పట్టించుకుంటుందా? 2019–21 ఆర్థిక సంవత్సరాలలో ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5’ (క్లుప్తంగా ఆరోగ్య సర్వే–5)ను నిర్వహించారు...

ఆరోగ్య సర్వేలలో శుభాశుభాలు

కోట్లాది ప్రజలు ఇప్పటికీ కటిక పేదరికంలో కునారిల్లుతున్నారు. ప్రతీ కుటుంబమూ తన ఆదాయంలో అధిక మొత్తాన్ని ఆహారం కోసమే వెచ్చిస్తోంది. అత్యధిక మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో చాలా మంది బాలల ఎదుగుదల గిడసబారిపోయింది. ఆహార లోటు దారిద్ర్యానికి ఒక నిర్ణయాత్మక సూచకం. ఆ పేద ప్రజల శ్రేయస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మరచిపోయింది.


పిడికెడు మెతుకులకు అల్లాడుతున్న పేదలను ప్రభుత్వం పట్టించుకుంటుందా? 2019–21 ఆర్థిక సంవత్సరాలలో ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5’ (క్లుప్తంగా ఆరోగ్య సర్వే–5)ను నిర్వహించారు. ఆరోగ్య సర్వే–4ను 2015–16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించారు. ఉభయ సర్వేల సందర్భంలోనూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. రెండు సర్వేల మధ్యకాలంలో చోటు చేసుకున్న మార్పులు, నాల్గవ సర్వే దాకా అనుసరించిన విధానాల ప్రభావంతోపాటు, నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల పర్యవసానాలను కూడ ప్రతిబింబించాయని చెప్పవచ్చు.


నాల్గవ సర్వేలో వలే ఐదవ సర్వేలో సైతం కీలక సూచకాలు– జనాభా, కుటుంబాల వివరాలు, అక్షరాస్యత, వివాహం, ప్రజనన శక్తి, తల్లీబిడ్డల ఆరోగ్యం, టీకాలు, వైద్య చికిత్సా పద్ధతుల నాణ్యత, రక్త హీనత, మహిళా సాధికారత, పొగాకు ఉత్పత్తుల వాడకం, మద్య సేవనం మొదలైనవి. ఈ రెండు సర్వేల నడుమ కాలం నాలుగు సంవత్సరాలు. ఈ నివేదికలు వెల్లడించిన అంకెలు గణాంక సంబంధ అంచనాలు. రెండు సర్వేల నిర్వహణకు ఒకే పద్ధతిని అనుసరించారు. సంఖ్యలలో మార్పులు ప్రయోజనకరమైన పాఠాలు చెప్పుతున్నాయి. కొన్ని మార్పులు మనకు గర్వకారణం. మరికొన్ని నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇంకొన్ని సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.


పెద్ద శుభవార్త ఏమిటంటే మొత్తం కాన్పుల రేటు 2.2 నుంచి (ఒక్కో మహిళకు పుట్టే పిల్లలు) 2.0కి పడిపోయింది. భారత జనాభా ప్రస్తుతానికి ఆందోళనకరమైన రీతిలో పెరగడం లేదు. ఊహించిన దానికంటే ముందుగానే స్థిరీకరణ అయ్యే అవకాశముంది. ఇది నిస్సందేహంగా శుభ పరిణామం. 88.6 శాతం మంది పిల్లలు ఆస్పత్రులలో పుడుతున్నారు. ఆరోగ్య సర్వే–4లో ఇటువంటి వారి శాతం 78.9 శాతం మాత్రమే. భారతీయులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని వారు ఆడపిల్లలు పుట్టాలనే కోరుకొంటున్నారు. లింగనిష్పత్తి (ప్రతీ 1000 మంది పురుషులకు స్త్రీలు) 991 నుంచి 1020కి పెరిగింది. 2015–16లో దేశ జనాభాలో 88 శాతం మంది విద్యుత్ వసతి ఉన్న గృహాలలో నివసిస్తున్నారు. మోదీ పాలనలో వీరి శాతం 96.8 శాతానికి పెరిగింది (రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మాణమవలేదు సుమా!). కొద్ది మంది యువతీ యువకులు మాత్రమే తమ తమ చట్టబద్ధ వివాహ వయస్సు 18, 21 సంవత్సరాల లోపు పెళ్ళి చేసుకొంటున్నారు. అయితే 23.3 శాతం మంది స్త్రీలు 18 ఏళ్ల వయస్సు లోపే వివాహం చేసుకుంటున్నారు. లక్షిత మార్పుకు ఇంకా చాలాదూరం ప్రయాణించవలసి ఉంది.


భారత జనాభాలో సగం మంది పది సంవత్సరాల పాఠశాల విద్య పూర్తి చేయని వారే అనేది నిస్సందేహంగా ఒక పెద్ద దుర్వార్త. స్త్రీలలో 59 శాతం మంది, పురుషులలో 49.8 శాతం మంది తమ పాఠశాల విద్యను పూర్తి చేసుకోవడం లేదు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం అనంతరం కూడా దేశ జనాభాలో సగం మంది 21వ శతాబ్ది ఉద్యోగాలు, వ్యాపారాలకు అనర్హులుగా ఉన్నారు. ఉన్నత విద్య, అధునాతన సాంకేతికతల వినియోగ నైపుణ్యాలు సగం మంది భారతీయులకు అందకపోవడం ఎంతైనా శోచనీయం. భారత ప్రజలలో అత్యధికులు ఇంకా యువ వయస్సులో ఉన్నవారే (15 సంవత్సరాల వయస్సులోపు వారు 26.5 శాతం మంది ఉన్నారు). అయితే యువ, వృద్ధ భారతీయుల నిష్పత్తి తగ్గిపోతోంది. అంటే వృద్ధ జనాభా పెరిగిపోతోంది. మనం గొప్పగా చెప్పుకుంటున్న ‘జనాభా లబ్ధి’ ఇంకెంతో కాలం మనకు ప్రయోజనాలను సమకూర్చదు. మహిళలో అత్యధికులు రక్తహీనతతో బాధపడుతున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న మహిళల్లో 57 శాతం మంది పాండురోగ పీడితులే.


15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిలో 59.1 శాతం మంది రక్త హీనతతో బాధపడుతుండడం మరింత ఆందోళనకరమైన విషయం. ఈ రెండు నిష్పత్తులు ఆరోగ్య సర్వే–4 అనంతరం బాగా పెరిగిపోయాయి. మరింత చేదు వార్త ఏమిటంటే 6 నుంచి 23 నెలల మధ్య వయస్సు ఉన్న బాలల్లో 11.3 శాతం మందికి సరైన పోషకాహారం అందడం లేదు. తత్ఫలితంగా ఐదేళ్ల వయస్సులోపు బాలల్లో 32.1 శాతం మంది వయస్సుకు తగ్గ బరువు కంటే తక్కువ బరువులో ఉన్నారు. 35.5 శాతం మంది ఎదుగుదల గిడసబారిపోయింది. శిశు మరణాల రేటు ప్రతీ 1000 మందికి 35.2గా ఉంది. ఐదేళ్ల వయస్సులోపు శిశు మరణాల రేటు ప్రతీ వేయి మందికి 41.9గా ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే ఇది చాలా చాలా అధికం.


ఈ రెండు సర్వేలలోని కొంత సమాచారం, కొన్ని అంశాలపై మరింత స్పష్టత నిచ్చే బదులు మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ‘మెరుగైన తాగునీటి వనరు’ ఉన్న గృహాలలో 95.9 శాతం మంది నివశిస్తున్నారని సర్వేల సమాచారం వెల్లడించింది. ‘మెరుగైన తాగునీటి వనరు’ అంటే ఏమిటో ఒక పాదసూచిక ఇలా పేర్కొంది. ‘పైప్ ద్వారా సరఫరా అవుతున్న మంచినీరు, పబ్లిక్ ట్యాప్ లేదా ఒక గొట్టపు బావి’. అదే నిర్వచనంలో ‘రక్షిత తవ్విన బావి, రక్షిత నీటి ఊట, వర్షపు నీరు’ అని కూడా ఉంది. దీన్ని బట్టి 95.9 శాతం అంకెకు చేరేందుకు సంవత్సరాల నాటి అరక్షిత నీటి వనరులను కూడా పరిగణనలోకి తీసుకున్నారనేది స్పష్టమయింది.


2024 సంవత్సరంలోగా ప్రతీ కుటుంబానికి ఒక ప్రత్యేక వాటర్ ట్యాప్ సమకూర్చడమనే లక్ష్యాన్ని మోదీ సర్కార్ నిర్దేశించుకున్నది కదా. ఆ లక్ష్యాన్ని సాధించినట్టు అంతిమంగా ప్రకటించే ప్రయత్నాలలో భాగంగానే ప్రస్తావిత గణాంకాలను వెల్లడించినట్టుగా అర్థం చేసుకోవచ్చు. పారిశుధ్యం విషయంలో కూడా మాటల, అంకెల గారడీ బాగా జరిగింది.ఉజ్వల యోజన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. అయితే కేవలం 58.6శాతం కుటుంబాలు మాత్రమే వంట పనులకు స్వచ్ఛ ఇంధనాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఈ గణాంకం ఎల్‌పీజీ లేదా పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించినదే గానీ వాస్తవంగా ఎన్ని ఎల్‌పీజీ సిలిండర్లను ఉపయోగించుకుంటున్నారన్న దాని గురించి ఏమీ చెప్పదు.


వివిధ అంశాలకు సంబంధించిన ఈ వృద్ధిరేట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే అవి నిష్ప్రయోజనకర వృద్ధిరేట్లు. ఇది నిష్ఠుర సత్యం. ఎందుకంటే ఇంకా కోట్లాది ప్రజలు కటిక పేదరికంలో కునారిల్లుతున్నారు. మరొక ముఖ్యమైన సూచకాన్ని తీసుకుందాం. అది ఆహార వినియోగం. ఒక కుటుంబ ఆదాయంలో అధిక మొత్తాన్ని ఖర్చు పెట్టేది ఆహారాన్ని సమకూర్చుకోవడానికే కదా. మరి అత్యధిక మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో చాలా మంది బాలల ఎదుగుదల గిడసబారిపోయింది. ఆహార కొరత పేదరికానికి ఒక నిర్ణయాత్మక సూచకం. అల్ప దేవతల బిడ్డలు అయిన ఆ పేద ప్రజల శ్రేయస్సును ప్రస్తుత ప్రభుత్వం మరచిపోయింది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)



Read more