హిమాచల్ అసెంబ్లీ గేటుకు ఖలిస్థాన్ జెండాలు... సీఎం ఘాటు స్పందన...

ABN , First Publish Date - 2022-05-08T17:43:33+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) శాసన సభ

హిమాచల్ అసెంబ్లీ గేటుకు ఖలిస్థాన్ జెండాలు... సీఎం ఘాటు స్పందన...

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) శాసన సభ ప్రధాన ద్వారానికి, ప్రహరీ గోడకు ఖలిస్థాన్ జెండాలను కట్టడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిరికిపంద చర్య అని, దీనిపై అత్యంత వేగంగా దర్యాప్తు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


ధర్మశాలలోని శాసన సభ ప్రధాన ద్వారం, ప్రహరీ గోడలపై ఆదివారం ఉదయం ఖలిస్థాన్ (Khalistan) జెండాలు, రాతలు కనిపించాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ (Jairam Thakur) ఇచ్చిన ట్వీట్‌లో, ధర్మశాల (Dharmshala) శాసన సభ సముదాయంలో రాత్రి వేళలో ఖలిస్థాన్ జెండాలను ఎగురవేయడం పిరికిపంద చర్య అని, ఈ చర్యను తాను ఖండిస్తున్నానని తెలిపారు. ఈ శాసన సభ (Assembly) భవనంలో కేవలం శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతాయని, ఆ సమయంలో దీనికి భద్రతను మరింత కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. దీనిని అనుకూలంగా మలచుకుని ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్నారు. దీనిని తాము సహించబోమని హెచ్చరించారు. దమ్ముంటే పగటి పూట వెలుగులో బయటకు రావాలని, రాత్రి పూట చీకట్లో కాదని సవాల్ చేశారు. 


పోలీసు సూపరింటెండెంట్ కుశల్ శర్మ మాట్లాడుతూ, ఈ సంఘటన శని, ఆదివారాల మధ్య రాత్రి కానీ, తెల్లవారుజామున కానీ జరిగి ఉండవచ్చునని తెలిపారు. విధాన సభ గేటు నుంచి ఖలిస్థాన్ జెండాలను తొలగించామన్నారు. ఇది పంజాబ్ నుంచి వచ్చిన కొందరు టూరిస్టుల చర్య అయి ఉండవచ్చునన్నారు. దీనిపై తాము కేసు నమోదు చేస్తామన్నారు. 


ధర్మశాల సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ శిల్పి భేక్తా మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ బహిరంగ ప్రదేశాల రూపాన్ని చెడగొట్టడాన్ని నిరోధించే చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని చెప్పారు. మరింత అప్రమత్తంగా పని చేయవలసిన అవసరం ఉందని తమను మేలుకొలిపే చర్య ఇది అని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, సిమ్లాలో ఖలిస్థాన్ జెండాను ఎగురవేయాలని Sikhs For Justice ఉగ్రవాద సంస్థ నేత గుర్‌పత్వంత్ సింగ్ పన్ను ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత వారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ఖలిస్థాన్ జెండాను యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తగులబెట్టింది. ఈ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు వీరేశ్ శాండిల్య, హిమాచల్ ప్రదేశ్ విభాగం చీఫ్ రాజ్‌ కుమార్ అగర్వాల్ ఈ జెండాను తగులబెట్టి, ఖలిస్థాన్ డిమాండ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాను ప్రదర్శించారు. 


Read more