దేవుడే దిక్కయితే జగన్‌ ఎందుకు?

Published: Sun, 21 Feb 2021 00:21:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దేవుడే దిక్కయితే జగన్‌ ఎందుకు?

తమిళనాడులో జల్లికట్టు క్రీడను సుప్రీంకోర్టు నిషేధించడంతో తమిళులంతా ఒక్కటై ఉద్యమించారు. అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున జల్లికట్టు క్రీడను అనుమతించేలా కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ జారీ చేసింది. కావేరీ జలాలను తమిళనాడుకు పంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కర్ణాటకలో కన్నడిగులంతా ఉద్యమించి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమలును అడ్డుకున్నారు. ఈ రెండు సందర్భాలలో ఆయా రాష్ర్టాలలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటి పైకివచ్చి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాడాయి. తమిళనాడులో జల్లికట్టు క్రీడకు అనుకూలంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఉద్యమించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజకీయ పక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, పోరాటానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా నిలువరించే విషయంలో ప్రజలు కూడా తగినంతగా స్పందించడం లేదు. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు క్రీడ కోసమే తమిళులు ఏకం కాగా లేనిది ఎంతో మంది త్యాగాల పునాదుల మీద నిర్మితమైన విశాఖ ఉక్కు కోసం ఇటు రాజకీయ పార్టీలు గానీ, అటు ప్రజలు గానీ నిర్దిష్ట కార్యాచరణ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం బాధాకరం. హైదరాబాద్‌లో నివసిస్తున్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం విశాఖ ఉక్కు కోసం గొంతెత్తకపోవడం గమనార్హం. ఇదే సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసైగ చేస్తే చాలు ‘మేము సైతం’ అని రంగంలోకి దిగుతారు. కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపునివ్వడంతో సినీ ప్రముఖులు పోటీ పడి మరీ మొక్కలు నాటి ఫొటోలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే మాత్రం అందరికీ లోకువే! అవున్లే.. ప్రజలకే పట్టనప్పుడు సినిమావాళ్లు మాత్రం ఎందుకు స్పందిస్తారు? రాష్ట్రప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని కేంద్రప్రభుత్వ పెద్దలు సైతం రాష్ట్రంతో ఆడుకుంటున్నారు.


ప్రత్యేక హోదా విషయమే తీసుకుందాం. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాజ్యసభలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అంగీకరించాయి. అయినా హోదా ఇవ్వడం కుదరదు అని నరేంద్ర మోదీ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ‘ఇంకేం చేస్తాం, సర్దుకుపోతాం!’ అని ప్రజలు కూడా రాజీ పడిపోయారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు నూరిపోశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అదే పెద్దమనిషి ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉంటానని, దేవుడు కరుణిస్తే కేంద్రం మనసు మారి రాష్ర్టానికి ఆ హోదా లభిస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పట్లో ప్రత్యేక హోదాకు మరో ప్రత్యామ్నాయం లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పుడు ఇవ్వకపోయినా సర్దుకుపోతామంటున్నారు. కేంద్రప్రభుత్వం హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి అంగికరించినప్పుడు ‘పాచిపోయిన లడ్డూ ఇస్తారా?’ అని గర్జించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు అదే భారతీయ జనతాపార్టీ పంచన చేరిపోయారు. హోదా విషయాన్ని ఆయన మరచిపోయారు. మొత్తంమీద ‘అన్న వస్త్రం దక్కకపోగా, ఉన్న వస్త్రం కూడా పోయినట్టు’–హోదా రాకపోగా కేంద్రం ఇవ్వజూపిన ప్రత్యేక ప్యాకేజీ కూడా గాల్లో కలిసిపోయింది. ఎన్నికలలో హోదా అనేది ఎజెండానే కాకుండా పోయింది. రాష్ట్ర ప్రజల మనస్తత్వం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు విశాఖ ఉక్కును విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కేంద్ర పెద్దలను తప్పుబట్టడంలో అర్థం లేదనిపిస్తోంది. ఎంపిక చేసిన నాలుగైదు వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా అన్ని రంగాలలో పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్రప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరించాలని అనుకుంటున్నదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చెబుతున్నారు.


విధాన నిర్ణయం అంటే ఏమిటి? దాన్ని ఎవరు తీసుకుంటారు? ఒకే ఒక వ్యక్తి, అదేనండీ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయమే ఇప్పుడు మన దేశంలో విధాన నిర్ణయమైపోతున్నది. ఆయన నిర్ణయాలు రాజ్యాంగం కంటే గొప్పవని బీజేపీ నాయకులు కీర్తిస్తుంటారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతిరోజూ పెంచుతున్నప్పటికీ ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరు తెరవడు. ఎందుకంటే వారికి నరేంద్ర మోదీ అంటే భయం. పెట్టుబడుల ఉపసంహరణ విషయానికి వస్తే గుజరాత్‌లో కూడా విశాఖ ఉక్కు తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అని ప్రధానిని ప్రశ్నించే ధైర్యం దేశంలో ఎవరికీ లేదు. బీజేపీ నాయకులకే కాదు, ప్రతిపక్షంలో ఉన్న ఎంతోమంది నాయకులకు కూడా మోదీ అంటే హడల్‌. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పార్టీల గురించి చెప్పే పనే లేదు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఉంది. కానీ, అవినీతికి సంబంధించిన కేసులలో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఆయనకు కేంద్రపెద్దల చల్లని చూపు కావాలి. నిన్నటిదాకా అధికారంలో ఉండి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబునాయుడికి బీజేపీ కేంద్రపెద్దలతో పెట్టుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో శాసనసభ ఎన్నికల సందర్భంగా అనుభవంలోకి వచ్చింది. సో.. ఆయన కూడా కేంద్రం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా పాతికేళ్ల తర్వాతనైనా అధికారంలోకి రాకపోతామా? అని తనతో పాటు కార్యకర్తలకు సైతం నచ్చచెప్పుకొంటున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే బీజేపీతో జత కట్టారు కనుక ఆయన కూడా ప్లీజ్‌ అంటూ కేంద్ర పెద్దల చుట్టూ తిరగడానికే పరిమితం అవుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో నిర్ణయం తీసుకోవలసింది కేంద్రమే అని ఆయన చేతులు కడిగేసుకున్నారు. రాజకీయ ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుందన్న భయం ఉన్నప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా విధాన నిర్ణయాలను సైతం ఆచితూచి తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం అంతంత మాత్రమే. అధికారంలోకి రాలేనని గానీ, ఉన్న అధికారం పోతుందని గానీ ఆ పార్టీకి భయం లేదు. సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్‌‌రెడ్డి కానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కానీ తమను గట్టిగా ఎదిరించలేరని, తమ కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తూ నమ్మకంగా పడివుంటారని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. 


అన్నిటికీ దేవుడేనా?

ప్రత్యేక హోదా విషయంలో మాదిరిగానే విశాఖ ఉక్కు విషయంలో కూడా దేవుడు కరుణిస్తే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాజాగా సెలవిచ్చారు. అన్నిటికీ దేవుడే దిక్కయినప్పుడు ఇక ముఖ్యమంత్రి ఎందుకు? ప్రజల సొమ్మును పప్పు బెల్లాల వలే పంచిపెట్టడానికి మాత్రమే తాను ఉన్నానని, మిగతా అంశాలన్నీ దేవుడే చూసుకుంటాడని ఆయన చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రత్యేక హోదా పోతే పోయింది, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుందామన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేయడం లేదు. తాను బలమైన నాయకుడినని జగన్‌ నమ్ముతుంటారు. అదే నిజమైతే ప్రజలకు నిజాలు చెప్పాలి. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? హోదా తీసుకొచ్చే బాధ్యతను దేవుడిపై ఎందుకు నెడుతున్నారు? ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో కూడా అంతే! దేవుడిపై భారం వేయడం ఎందుకు? దేవుడికి బాధ్యత అప్పగించినా కేంద్రం మనసు మారకపోతే అసెంబ్లీలో తీర్మానం చేస్తానని ప్రకటించడం వంచన కాదా? శాసనసభలో ఆమోదించే తీర్మానాలను కేంద్రప్రభుత్వాలు గడ్డిపోచలా తీసిపారేస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే కదా! అంతే కాదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అధీనంలో ఉన్న భూములలో నుంచి ఏడు వేల ఎకరాలను ప్లాట్లుగా అభివృద్ధి చేసి అమ్మేస్తే సమస్య పరిష్కారమవుతుందని కూడా జగన్‌రెడ్డి చిట్కా చెప్పారు. కేంద్రానికి ఈ ఆలోచన ఎందుకు రాలేదో మరి! ఇప్పుడు భూములు అమ్మి కొంత కాలం నడుపుతారు. ఆ తర్వాత ఏం అమ్ముతారు? భూములు లేకపోతే విశాఖ ఉక్కును ప్రైవేటుసంస్థలు మాత్రం ఎందుకు కొంటాయి? విశాఖ ఉక్కుకు సొంతంగా గనులు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఓబుళాపురం గనులను విశాఖ ఉక్కుకు కేటాయించవచ్చు కదా! ‘‘చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి సాధించింది ఏమీ లేదు, కేంద్రమంత్రులకు శాలువాలు కప్పడం తప్ప. ఆ తర్వాత వారు చంద్రబాబు చెవిలో పూలు పెడతారు. రాష్ర్టానికి తిరిగొచ్చాక ఆయన మన చెవుల్లో క్యాబేజీ పూలు పెడతారు’’ అని ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు జగన్‌ కూడా ఢిల్లీ నుంచి పిలుపు రాగానే ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వెళుతున్నారు. శాలువాతో పాటు అమిత్‌షాకు ఇష్టమని వినాయకుడి విగ్రహం కూడా ఇచ్చి వస్తుంటారు. ఇప్పటివరకు చాలాసార్లు వినాయకుడి విగ్రహాలు ఇచ్చారు గానీ, రాష్ర్టానికి సంబంధించిన సమస్య ఒక్కటీ సానుకూలంగా పరిష్కారం కాలేదు. దీన్నిబట్టి జగన్‌ కూడా ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతున్నారనుకోవాలా? కేంద్రాన్ని ఏ విషయంలోనైనా నిలదీసే పరిస్థితుల్లో రాష్ర్టానికి చెందిన పార్టీలు లేవు. జనసేనాని ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్‌ షాను కలిశారు. విశాఖ ఉక్కు విషయంలో పునరాలోచన చేయకపోతే రాజకీయంగా తమ పార్టీ కూడా బలహీనపడుతుందని చెప్పారట. దీంతో ఆలోచిస్తామని హామీ ఇచ్చి పవన్‌ కల్యాణ్‌ను అమిత్‌ షా తిప్పి పంపారు. మొత్తమ్మీద రాజకీయ రంగస్థలం పైన ఎవరి ఆట వారు ఆడుతున్నారు. రాష్ట్రంలో తాము ఎదగకుండా ప్రధాన రాజకీయపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ నాయకులు తాజాగా ఆక్రోశిస్తున్నారు. ఎవరినో నిందించే బదులు బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. రాజధాని అమరావతి విషయం అడిగితే, అది కేంద్రం పరిధిలో లేదు అంటారు. విశాఖ ఉక్కు గురించి అడిగితే, అది విధాన నిర్ణయం అంటారు. అయినా తమ పార్టీని ప్రజలు ఆదరించాలని బీజేపీ నాయకులు కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పాలంటే వైసీపీ లేదా తెలుగుదేశం ఉండగా మనం ఒళ్లు హూనం చేసుకుంటూ బలపడే ప్రయత్నం చేయడం ఎందుకు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు ఉంది. అందుకే కాబోలు, ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం ఎక్కడా అటువంటి ధీమా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షంతో పాటు జన సేనాని పవన్‌ కల్యాణ్‌ అడ్డం తిరిగితే తప్ప విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం వెనక్కు తగ్గే అవకాశం లేదు. కేంద్రప్రభుత్వంపై పోరాడే శక్తి, బుద్ధి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి ప్రసాదించాలని మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం. ప్రశ్నించాల్సిన గొంతులు మూగబోయినప్పుడు దేవుడే దిక్కవుతాడు. ప్రజల తరఫున నిలబడి పోరాడాల్సిన ముఖ్యమంత్రే దేవుడిపై భారం వేస్తున్నప్పుడు ప్రజలకు మాత్రం దేవుడు మినహా వేరే దిక్కేముంటుంది?


ప్రజలన్నా సరైన తీర్పివ్వాలి!

అయితే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి బాధ్యతను గుర్తుచేసే అవకాశం మున్సిపల్‌ ఎన్నికల రూపంలో రాష్ట్ర ప్రజలకు వచ్చింది. గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థకు సైతం వచ్చే నెల 11న పోలింగ్‌ జరగనుంది. ఈ అవకాశాన్ని కనీసం విశాఖ ప్రజలైనా సద్వినియోగం చేసుకుంటారో లేదో తెలియదు. పార్టీల ప్రాతిపదికన జరగనున్న ఈ ఎన్నికల్లో విశాఖ నగరపాలక సంస్థను సైతం అధికార వైసీపీ సొంతం చేసుకుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసినట్టే అవుతుంది. రాజధాని అమరావతి తరలింపునకు ప్రజల మద్దతు ఉందని రుజువుచేయడం కోసం విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలను ఎలాగైనా గెలుచుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఈ రెండు నగరపాలకసంస్థల్లో వైసీపీ గెలిస్తే అమరావతి తరలింపునకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. నిజంగా కూడా అలాగే జరిగితే ఇక అమరావతి.. అమరావతి అని కలవరించడం కూడా వ్యర్థం. విశాఖ ఉక్కు విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. విశాఖ నగరపాలకసంస్థను వైసీపీ గెలుచుకుంటే స్థానిక ప్రజల్లో కూడా సెంటిమెంటు లేదని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అదే జరిగితే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు కూడా చల్లబడిపోతాయి. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ దారి తాము చూసుకోవలసి వస్తుంది. ఒకవేళ విశాఖలో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి చురుకు తగులుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల తమకు నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గుర్తించినప్పుడే కేంద్రాన్ని నిలదీయడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. నిజానికి కీలక అంశాలలో రాజ్యసభలో వైసీపీ మద్దతు కేంద్రంలోని బీజేపీకి అవసరం. ఇప్పటివరకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తోంది. ఇకపై అలా కుదరదని స్పష్టంచేయగలిగితే దేవుడిపై భారం వేయాల్సిన అవసరం రాదు. ఆ బాధ్యతను జగన్‌రెడ్డి తీసుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయని అధికార వైసీపీ నాయకులు సంబరపడిపోతున్నారు. మరి తమను నమ్మి అంతలా మద్దతునిచ్చిన ప్రజల రుణం తీర్చుకోవలసిన బాధ్యత వైసీపీ నాయకుల మీద ఉంటుంది కదా! ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంను బద్దలుకొట్టామని, అక్కడ కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకున్నామని అధికార పార్టీ నాయకులు నృత్యాలు చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని ఎవరైనా భావిస్తారు. అందులో తప్పు కూడా లేదు. కుప్పంలో చంద్రబాబు దెబ్బతింటే ప్రజలకు కలిగే లాభం ఏమిటి? జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి 21 మాసాలు అవుతోంది. ఈ 21 నెలల్లో ఇది సాధించామని చెప్పుకునే పరిస్థితి జగన్‌కు ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటు కోసం వివిధ రాష్ర్టాలు పోటీపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయడం లేదు. కర్ణాటకకు టెస్లా కంపెనీ, ఉత్తరప్రదేశ్‌కు సాంసంగ్‌ మొబైల్‌ తయారీ కేంద్రం, తమిళనాడు, తెలంగాణలకు అమెజాన్‌ కేంద్రాలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు సైతం ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదంటే జగన్‌ ప్రభుత్వానికి అది అవమానం కాదా? లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు వలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం మినహా ఉపాధి కల్పనకు ఏమి చేయాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వింతగా ఉంది. ప్రత్యర్థులను వేధించడం మినహా మేం ఇది సాధించుకు వచ్చామని చెప్పుకోలేని స్థితిలో ఉండటం ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా అవమానమే. ఒక్క కియా మోటార్స్‌ సంస్థ రావడం వల్ల అనంతపురం జిల్లాలో ఆర్థిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. భూముల ధరలు పెరిగాయి. రైతులు లాభపడ్డారు. కొత్త పరిశ్రమలు రాకపోగా విశాఖ ఉక్కు వంటి సంస్థలు కూడా ప్రైవేటుపరమైతే హిందుస్థాన్‌ జింక్‌కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణలో కూడా స్థానికసంస్థల ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్రసమితి దాదాపు వంద శాతం స్థానాలను కైవసం చేసుకుంది. అయినా, ఆ వెంటనే జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి పాలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు జరిగిన ఎన్నికల్లో కూడా పరాభవమే ఎదురైంది. ఈ నేపథ్యంలో జగన్‌ అండ్‌ కో స్థానికసంస్థలకు జరిగే ఎన్నికల్లో ఫలితాలను చూసి మురిసిపోకుండా రాష్ర్టాన్ని అభివృద్థి చేసే ఆలోచనలు కూడా చేయాలి. దేవుడి దయ ఉంటే రాష్ట్రం దానంతట అదే అభివృద్ధి చెందుతుందంటే కుదరదు. ముఖ్యమంత్రిని వేధిస్తున్న కేసుల బలహీనత రాష్ర్టానికి శాపం కాకూడదు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ కాలగర్భంలో కలిసిపోయింది. ప్రత్యేక హోదా గాలిలో కలిసింది. ముఖ్యమంత్రి దుర్బుద్ధి కారణంగా అమరావతి విలవిల్లాడుతోంది. ఇప్పుడు విశాఖ ఉక్కు వంతు. హతవిధీ! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఎవరు కాపాడాలి?

ఆర్కే

దేవుడే దిక్కయితే జగన్‌ ఎందుకు?

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.