ఊరు విడిచి పంట చేనులో మకాం

ABN , First Publish Date - 2022-05-11T06:50:03+05:30 IST

తమ జీవనాధారమైన సాగుభూమిని కొందరు గ్రామ పెద్దలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ పంట చేనులోనే మకాం వేసి బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే.. నేరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజులతండా గ్రామంలో ఇటీవల భూ వివాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవిసింగ్‌, ఆయన సోదరులు దాదాపు

ఊరు విడిచి పంట చేనులో మకాం
తమ అధీనంలో ఉన్న పంట భూమిలో డేరాలు వేసుకుని నివాసం ఉంటున్న బాధిత కుటుంబాలు

రాజులతండాలో భూ వివాదం

అధికారుల జోక్యంతో సద్దుమనిగిన వివాదం

ఆదిలాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): తమ జీవనాధారమైన సాగుభూమిని కొందరు గ్రామ పెద్దలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ పంట చేనులోనే మకాం వేసి బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే.. నేరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజులతండా గ్రామంలో ఇటీవల భూ వివాదం చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన  దేవిసింగ్‌, ఆయన సోదరులు దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల కొందరు గ్రామ పెద్దలు ఆ భూమిలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో భూమిని ఇచ్చేందుకు ఒప్పుకోక పోవడంతో బాధిత కుటుంబంపై కొందరు పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక భూమిని కబ్జా చేస్తారేమోనన్న భయంతో పంట భూమిలోనే తా త్కాలిక డేరాలు వేసుకుని నివాసం ఉన్నారు. భూమిని ఇవ్వకుంటే తమను చంపుతామని కొందరు గ్రామ పెద్దలు బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఈ విషయాన్ని తెలుసుకున్న నేరడిగొండ ఎస్సై మహేందర్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్‌ జగదీశ్వరి, ఆర్‌ఐ నాగోరావ్‌లు రాజులతండాకు వెళ్లి బాధితులతో మాట్లాడారు.  బెదిరింపుల కు పాల్పడ్డ వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,   కలెక్టర్‌ ఆదేశాల మేరకు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. అయితే బాధితులు మాత్రం ఉప సర్పంచ్‌ జగదీశ్వర్‌తో పాటు మరో 16 మంది తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం చేస్తామనడంతో తాత్కాలిక డేరాలు తొలగించి ఇళ్లలోకి వెళ్లిపోయారు.

ప్రభుత్వ భూమిని అక్రమిస్తే చర్యలు తీసుకుంటాం

: పవన్‌చంద్ర, తహసీల్దార్‌, నేరడిగొండ

ప్రభుత్వ భూమిపై కలెక్టర్‌కు నివేదికలు పంపించడం జరిగింది. గ్రామంలో ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసు అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం. గ్రామంలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబం మా దృష్టికి తీసుకొచ్చింది. గ్రామంలో ఎలాంటి గొడవలు జరుగకుండా అవగాహన కల్పించడం జరుగుతుంది. సమస్యను గ్రామస్థులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుంటాం.

Read more