చాలీసా చదొవొద్దు.. ఈద్ జరుపుకోనివ్వండి: రాజ్‌ థాకరే

ABN , First Publish Date - 2022-05-02T23:58:05+05:30 IST

మే 3న ఈద్ ఉంది. సంబరాలను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అయితే మే 4 తర్వాత మాత్రం అస్సలు వినబోం.. మా డిమాండ్లను నెరవేర్చకుంటే రెట్టింపు శక్తితో హనుమాన్ చాలీసా పఠిస్తాం. మా అభ్యర్థన మీకు అర్థం కాకపోతే, మాకు తెలిసిన మార్గంలో పరిష్కరించుకుంటాం...

చాలీసా చదొవొద్దు.. ఈద్ జరుపుకోనివ్వండి: రాజ్‌ థాకరే

ముంబై: లౌడ్‌స్పీకర్ల వివాదానికి తెరలేపిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ థాకరే సోమవారం సంచలన ప్రకటన చేశారు. మే 3 న ఈద్ సందర్భంగా హనుమాన్ చాలీసా చదవొద్దని, ముస్లింలను ఈద్ పండగ చేసుకోనివ్వండంటూ పిలుపునిచ్చారు. తాము ఏ పండగకీ వ్యతిరేకం కాదని, అన్ని పండగలు జరుపుకోవాలని ఆయన అన్నారు. సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.


‘‘మే 3న ఈద్ ఉంది. సంబరాలను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అయితే మే 4 తర్వాత మాత్రం అస్సలు వినబోం.. మా డిమాండ్లను నెరవేర్చకుంటే రెట్టింపు శక్తితో హనుమాన్ చాలీసా పఠిస్తాం. మా అభ్యర్థన మీకు అర్థం కాకపోతే, మాకు తెలిసిన మార్గంలో పరిష్కరించుకుంటాం. మే 4 నుంచి నేను మౌనంగా ఉండబోను. అప్పటికి లౌడ్‌స్పీకర్లను తొలగించకుంటే, మహారాష్ట్ర బలం ఏమిటో చూపిస్తాను’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ముందు ‘‘మహారాష్ట్ర సైనికులకు’’ అని ఎంఎన్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి రాసుకొచ్చారు.


మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తీసేయకపోతే అక్కడే తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని రాజ్ థాకరే ముందు నుంచి హెచ్చరికలు చేస్తు్న్నారు. మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను మే 4 తేదీ లోపు తీసివేయకపోతే తమ పవరేంటో చూపిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇది వరకే హెచ్చరికలు చేశారు. అయితే మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లు తీసేయమనడం మతపరమైన అంశం కాదని, సామాజిక కోణంలోనే ఈ డిమాండ్ చేస్తున్నట్లు రాజ్ థాకరే చెప్తున్నారు.

Read more