Mother’s Day: తల్లుల ఆరోగ్యానికి గుప్పెడు బాదం గింజలు!

ABN , First Publish Date - 2022-05-05T23:40:00+05:30 IST

ఈ నెల 8 మాతృ దినోత్సవాన్ని జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమైంది. మాతృ దినోత్సవం సరే.. భావి తరాలను

Mother’s Day: తల్లుల ఆరోగ్యానికి గుప్పెడు బాదం గింజలు!

ఈ నెల 8 మాతృ దినోత్సవాన్ని జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమైంది. మాతృ దినోత్సవం సరే.. భావి తరాలను అందించే మాతృమూర్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించాలి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఉద్యోగ నిర్వహణ, ఇతర పనుల కారణంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఇది ఏమాత్రం మంచిది కాదు. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం బాగుంటుంది. వారు తమ కుటుంబాన్ని పట్టించుకుంటున్నట్టుగానే వారి గురించి కూడా వారు పట్టించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. స్నాక్స్‌ను తెలివిగా ఎంచుకోవాలి. తద్వారా తగిన పోషకాలు అందేలా చూసుకోవాలి.


ఇంకా వివరంగా చెప్పాలంటే వేయించిన స్నాక్స్‌కు బదులుగా గుప్పెడు బాదం పప్పును తీసుకుంటే ప్లాంట్ ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమన్-ఇ, మెగ్నీషియం, రైబోఫ్లోవిన్, జింక్ వంటివాటితోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. బాదం గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనశైలి వారి సొంతమవుతుంది. పాలు ఇచ్చే తల్లులు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్న దానిపై ఢిల్లీలోని మ్యాక్స్‌ హెల్త్‌కేర్ రీజనల్ హెడ్ (డైటిటిక్స్) రితికా సమద్దార్ మాట్లాడుతూ.. పాలిచ్చే తల్లులకు చక్కటి పౌష్టికాహారం అవసరమని అన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ఇది అత్యంత అవసరమన్నారు. పాలు పడేందుకు, ప్రసవానంతర సమయంలో మరింత త్వరగా కోలుకునేందుకు పోషకారం చాలా అవసరమని, కాబట్టి పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా ప్రొటీన్‌, కాల్షియం, ఐరన్‌  అధికంగా ఉండే పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లను తమ డైట్‌లో జోడించుకోవాలని సూచించారు.


ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ కోసం పాలిచ్చే తల్లులు ఓ గుప్పెడు బాదం పలుకులు తినడం మంచిదని రితిక అన్నారు. వీటికి ఆకలి తీర్చేగుణంతోపాటు బహుళ పోషకాలనూ కలిగి ఉంటాయి. విటమిన్‌-ఇ యాంటీ ఆక్సిడెంట్స్‌, డైటరీ ఫైబర్‌, రైబోఫ్లావిన్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, కాపర్‌, ప్రొటీన్‌, మాంగనీస్‌,కాల్షియం వీటిలో అధికంగా ఉంటాయి. వీటిలో ఫోలెట్‌, ఐరన్‌, నియాసిన్‌, థయామిన్‌, జింక్‌, పోటాషియం  వంటి ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైన కీలకమైన పోషకాలు కూడా ఉంటాయని రతికా సమద్దార్ వివరించారు.


గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం గురించి న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో మధుమేహం బారినపడిన తల్లులు భవిష్యత్‌లో మరింతగా ఈ వ్యాధి బారినపడేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు. ఆరోగ్యవంతమైన డైట్‌, జీవనశైలి వంటివి ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయన్నారు. బాదాంలు ఫైబర్‌ (30 గ్రాముల సర్వింగ్‌), 15 అత్యవసర పోషకాలు (30 గ్రాములు సర్వింగ్‌),మెగ్నీషియం (81ఎంజీ), పొటాషియం (220 ఎంజీ), విటమిన్‌-ఇ (7.7ఎంజీ) వంటివి ఉండటం వల్ల టైప్‌-2 మధుమేహం, లేదంటే అతి తక్కువ గ్లూకోజ్‌  కలిగిన వారికి అత్యున్నత పోషకాలతో కూడిన స్నాక్‌గా నిలుస్తుందని షీలా కృష్ణస్వామి వివరించారు.


 మాతృమూర్తులు తమ పౌష్టికాహారం తీసుకోవడంలో చూపే నిర్లక్ష్యంపై ఇంటిగ్రేటివ్‌ న్యూట్రిషియనిస్ట్‌, హెల్త్‌ కోచ్‌ నేహా రంగ్లానీ మాట్లాడుతూ.. తమ కుటుంబ ఆరోగ్యం కోసం తపించే  తల్లులు తమ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తుంటారని, ఫలితంగా పలు సమస్యల బారినపడతారని చెప్పుకొచ్చారు. కాబట్టి వారు తమ డైట్‌లో పౌష్టికాహారం జోడించాలని అన్నారు. బాదాములతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. బాదం గింజలు క్రమం తప్పకుండా తినడం వల్ల అత్యంత ప్రమాదకరమైన ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గి , రక్షిత హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌  నిర్వహించడంలో సహాయపడుతుందని వివరించారు. కాబట్టి తల్లులు బాదములను ప్రతి రోజూ తినడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. 30 గ్రాములు అంటే దాదాపు 23 బాదాములు తినడం ద్వారా శక్తిని సమకూర్చుకోవడంతోపాటు ఆకలిని కూడా తీర్చుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధనలో తేల్చినట్టు చెప్పారు.


తల్లులు ఎదుర్కునే రోజువారీ సవాళ్లపై బాలీవుడ్ ప్రముఖ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ.. తాను తల్లిగా మారిన తర్వాత తన కోసం తల్లి చేసిన త్యాగం, తనపై చూపిన ప్రేమ అపారమైనదని పేర్కొన్నారు. తల్లి విపరీతంగా అలసిపోతుంది కాబట్టి పిల్లలపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో అంతకుమించిన శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. తరచూ వ్యాయామాలు చేయడంతోపాటు షూటింగ్స్, ప్రయాణ సమయాల్లో తన వెంటనే ఎప్పుడూ బాదం పప్పులను తీసుకెళ్తానని చెప్పారు. అవి తనను శక్తిమంతంగా మలచడంతోపాటు రోజంతా ఆకలి దరిచేరకుండా అడ్డుకుంటాయని అన్నారు. 


ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ.. ఓ తల్లిగా, ఒకరికి ఏం కావాలన్నది తాను నిజంగా అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ మాతృదినోత్సవం వేళ తల్లులందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఫిట్‌నెస్‌ తరగతులలో చేరడం, రోజువారీ డైట్‌లో పండ్లు, బాదాములను జోడించడం వల్ల అపరిమిత ప్రయోజనాలను పొందవచ్చని అన్నారు.


సినీ, టెలివిజన్‌ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ.. చిన్నారిగా ఉన్నప్పుడు తన తల్లి ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన బాదములు ఇచ్చేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వాటిని తన డైట్‌లో జోడించడం వల్ల తన పిల్లలతో కలిసి ఆడుకునేందుకు తగిన శక్తిని పొందగలుగుతున్నట్టు చెప్పారు.


కన్నడ నటి  ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. తన తల్లి తనకు ఎప్పుడూ వెన్నెముకలా ఉండేవారని అన్నారు. తనకు సవాళ్లు ఎదురైన ప్రతిసారీ ఆమె అండగా నిలిచేవారని అన్నారు. ఆమె త్యాగాల వల్లే తానీరోజు ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడామెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని అన్నారు.  ఆమె డైట్‌లో గుప్పెడు బాదం పప్పులను భాగంగా చేయడం అందులో ఒకటని అన్నారు. 


Read more