కిడ్నాప్‌ కలకలం!

ABN , First Publish Date - 2022-05-09T05:35:38+05:30 IST

డొంకినవలసలో ఇద్దరు పిల్లల కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇందులో తొమ్మిది నెలల చిన్నారి ఉండడం ఆందోళన రేకెత్తించింది. అయితే రెండు గంటల్లో వ్యవధిలో పోలీసులు చిన్నారులతో పాటు నిందితురాలిని పట్టుకోవడంతో సుఖాంతమైంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంకినవలసలో కొండేటి సరోజిని, రేజేటి ప్రియాంక కుటుంబాలు ఇరుగు పొరుగు ఉంటాయి.

కిడ్నాప్‌ కలకలం!
కిడ్నాప్‌నకు గురైన తొమ్మిది నెలల చిన్నారి ధన్విత్‌

డొంకినవలసలో ఇద్దరు పిల్లల అపహరణ

అందులో ఒకరు తొమ్మిది నెలల చిన్నారి

రెండు గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

మహిళ అరెస్ట్‌ 

బాడంగి/రాజాం రూరల్‌, మే 8: డొంకినవలసలో ఇద్దరు పిల్లల కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇందులో తొమ్మిది నెలల చిన్నారి ఉండడం ఆందోళన రేకెత్తించింది. అయితే రెండు గంటల్లో  వ్యవధిలో పోలీసులు చిన్నారులతో పాటు నిందితురాలిని పట్టుకోవడంతో సుఖాంతమైంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంకినవలసలో కొండేటి సరోజిని, రేజేటి ప్రియాంక కుటుంబాలు ఇరుగు పొరుగు ఉంటాయి. సరోజిని కుమార్తె సుస్మిత స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో ఆదివారం ఉదయం ప్రియాంక కుమారుడు తొమ్మిది నెలల ధన్విత్‌ను ఇంటి బయట ఆడిస్తోంది. 11 గంటల సమయంలో పిల్లలిద్దరూ కనిపించలేదు.  అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు హుటాహుటిన బాడంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిందట గ్రామంలో వెంపడాపు గంగ ఇంటికి వచ్చిన విజయవాడకు చెందిన గొగ్గిలాపు శోభపై అనుమానం ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమె సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా విచారణ చేపట్టి రాజాంలో ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన అక్కడకు వెళ్లగా ఇద్దరు పిల్లలతో పాటు శోభ పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. గంగ విజయవాడలో పనిచేస్తున్నప్పుడు శోభ పరిచయమైంది. రెండు రోజుల కిందట శోభ డొంకినవలస వచ్చింది. అందరితో కలివిడిగా తిరిగాడింది. శనివారం బాధిత కుటుంబసభ్యులు, పిల్లలను బొబ్బిలికి తీసుకెళ్లి షాపింగ్‌ సైతం చేసింది. ఇంతలోనే కిడ్నాప్‌నకు వ్యూహం రూపొందించింది. ముందుగా బొబ్బిలిలో కారు బుక్‌ చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఆరుబయట ఆడుతున్న పిల్లలను అందులో ఎక్కించి ఎవరికీ అనుమానం రాకుండా ముందుగా వారిని రామభద్రపురం పంపించింది. తరువాత చిన్నారుల్లో ఒకరైన సుష్మిత మేనమామ వెంపడాపు వంశీ బైక్‌పై రామభద్రపురం బయలుదేరింది. రాజాం మీదుగా విజయనగరం వైపు వెళ్లడానికి ప్రణాళిక రూపొందించుకుంది. అయితే బాధిత కుటుంబసభ్యులు త్వరితగతిన ఫిర్యాదు చేయడం.. నిందితురాలి కదలికలపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రెండు గంటల్లోనే కేసును ఛేదించారు. అయితే ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులతో పోలీస్‌స్టేషన్‌ నిండిపోయింది. నిందితురాలితో పాటు బాధిత కుటుంబసభ్యులను విచారిస్తున్నట్టు డీఎస్పీ మోహనరావు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని.. కేసు వివరాలను పూర్తిస్థాయిలో త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.





Read more