చీలిక దిశగా.. ఆదివాసీ ఉద్యమం!

ABN , First Publish Date - 2022-05-08T05:33:18+05:30 IST

జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన ఆదివాసీ ఉద్యమం కొంత కాలంగా పూర్తిగా చల్లబడింది. ఒక్కప్పుడు ఆదివాసీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా హడలెత్తించింది.

చీలిక దిశగా.. ఆదివాసీ ఉద్యమం!
ఆందోళనలు చేపడుతున్న ఆదివాసీలు (ఫైల్‌)

తుడుందెబ్బకు ఎంపీ సోయంబాపురావ్‌ రాజీనామా

రాజకీయ జీవితానిచ్చిన ఉద్యమానికే దూరం

ఇప్పటికే చీలిక దిశగా ఉద్యమకారులు

ప్రశ్నార్థకంగా మారుతున్న ఉద్యమ భవిష్యత్తు

ఆదిలాబాద్‌,మే7(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన ఆదివాసీ ఉద్యమం కొంత కాలంగా పూర్తిగా చల్లబడింది. ఒక్కప్పుడు ఆదివాసీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా హడలెత్తించింది. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వమే దిగి రావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కూడా ఆదివాసీ ఉద్యమంపై పలుమార్లు స్పందించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఆదివాసీ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంపీ సోయంబాపురావ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆదివాసీల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో సోయంపై ఆదివాసీ సమాజం భారీ ఆశలు పెట్టుకుంది. చట్టసభల్లో ఆదివాసీల గళం వినిపించే అవకాశం దక్కిందని అందరూ సంబరపడ్డారు. కానీ అప్పటి నుంచే ఉద్యమానికి కష్టాలు మొదలై ఆపదలో పడింది. సోయంబాపురావు రాజకీయాల్లో బిజీ బిజీ కావడం, పార్టీ అధిష్ఠానం ఆదేశాలు పాటించడం, కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురు కావడంతో ఆదివాసీ ఉద్యమాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మూడేళ్లుగా జిల్లాలో పెద్దగా ఉద్యమ కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. బీజేపీ నుంచి సోయం  ఎంపీగా గెలువడంతో ఇతర రాజకీయ పార్టీల విమర్శలు కూడా తప్పడం లేదు. ఇటు పార్టీ ఆదేశాలు, అటు ఉద్యమకారుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇటీవల తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోయంబాపురావు ప్రకటించడం ఆదివాసీల్లో ఆందోళన రేపుతోంది. ఉద్యమానికి నాయకత్వం లేకుండానే పోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఉద్యమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఎంపీ సోయంబాపురావు తుడుందెబ్బకు రాజీనామా చేయడంపై ఆయనను ఫోన్‌లో సంప్రదించగా స్పందించ లేదు. 

అండగా నిలిచిన ఆదివాసీలు..

బీజేపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన సోయంబాపురావుకు ఆదివాసీలు అండగా నిలిచారనే చెప్పవచ్చు. మొదటి సారి ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ నుంచి బోథ్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుస ఓటమిలతో గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ దక్కక పోవడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత టీడీపీ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలలో కొన్నాళ్ల పాటు కొనసాగారు. చివరకు కాం గ్రెస్‌ నుంచి పార్లమెంట్‌ టికెట్‌ ఆశించినా దక్కక పోవడంతో ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో రాజకీయ వర్గాల్లో భారీ చర్చనే జరిగింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదివాసీ సమాజం ఓట్లన్ని గంపగుత్తగా సోయంబాపురావుకే పడడంతో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోక తప్పలేదు. మునుపెన్నడూ లేని విధంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ బోనీ కొట్టడం అది సోయంబాపురావ్‌తోనే సాధ్యమైందన్న చ ర్చకూడా జరిగింది. ఎందుకంటే ఆదివాసీలు ఉడుంపట్టుతో సోయం గెలుపునకు అండగా నిలవడంతో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చింది. ఆదివాసీ ఉద్యమంతోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోయంబాపురావుకు మంచి పట్టు, పరిచయాలు ఏర్పడ్డాయి. అసలు ఆదివాసీ ఉద్యమం అంటేనే సోయంబాపురావు అనే రీతిలో అప్పట్లో చర్చసాగింది. ఆయనకు రాజకీయ జీవితాన్ని అందించిన ఉద్యమానికి దూరం కావడం వెనుక పలురకాల కారణాలే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిచ్చుపెట్టిన ఎమ్మెల్సీ ఎన్నికలు..

ఆదివాసీ ఉద్యమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చుపెట్టాయనే చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూరంగానే ఉన్నా పలువురు ఆదివాసీలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదివాసీల తరఫున పెందూరుపుష్పరాణి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. అధికార టీ ఆర్‌ఎస్‌ అభ్యర్థులందరినీ మభ్యపెట్టినా చివరకు పోటీ తప్పలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుడుందెబ్బకు సంబంధించిన కొందరు ఉద్యమకారులు అధికార పార్టీ నుంచి భా రీగా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలతో సహా రాష్ట్ర కమిటీ నేతలు ప్రకటించడం తుడుందెబ్బలో పెను వివాదానికి దారి తీసింది. దీని వెనుక ఎంపీ సోయంబాపురావు ఉన్నట్లు పలువురు ఉద్యమకారులు బహిరంగంగానే ఆరోపించారు. ఈ సంఘటనతోనే తుడుందెబ్బ నేతల మధ్య మరింత దూరం పెరుగింది. ఉద్యమ సిద్ధాంతాలను పక్కన పెట్టి అధికార పార్టీకి అమ్ముడు పోయారన్న కారణంతో గొడం గణేష్‌, పుర్క బాపురావు, వెట్టిమనోజ్‌, గోడం రేణుక, పెందూరు పుష్పరాణిలను తుడుందెబ్బ నుంచి శాశ్వతంగా రాష్ట్ర కమిటీ బహిష్కరించింది. తమ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు బురద జల్లుతున్నారంటూ బహిష్కరణకు గురైన ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ సోయంను బదనం చేసేందుకే కొందరు ఆదివాసీ నేతలు కుట్ర చేశారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తుడుందెబ్బలో చిచ్చుపెట్టడంతో భారీ మార్పులు, చేర్పులకు, వివాదాలకు కారణమైందనే చెప్పవచ్చు. 


Read more